శ్రీకాకుళం న్యూకాలనీ:
సర్కారీ జూనియర్ కళాశాలల్లో చదువుతూ.. ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులపై ఇంటర్ విద్య డైరెక్టరేట్ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ కోసం ఈ నెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
పునర్విభజన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రభుత్వ కాలేజీలు 38 ఉన్నాయి. ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 5814 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 3439 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం నుంచి 5,188 మంది పరీక్షలకు హాజరుకాగా 3,588 ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఫెయిలైన విద్యార్థులతోపాటు తాము సాధించిన మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్(మార్కులు పెంచుకునేందుకు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు ఈ ఏడాది నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం వారి మార్కులను పెంచుకునేందుకు పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటర్‌బోర్డు అవకాశం కల్పించింది. ఈ విధానం అమలు చేయడం ఇదే మొదటిసారి. ఇంటర్‌లో సాధించిన మార్కులు ఐఐటీ, ఎన్‌ఎస్‌ఐటీల్లో సీటు సాధించేందుకు కీలకం కానున్నాయి. ఇంటర్‌లో రెండేళ్లు కలిపి ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం, ఓసీ, బీసీ, ఓబీసీ తదితరులకు 75 శాతం మార్కులు సాధిస్తే ఈ వెయిటేజీ ఉత్తమ కోర్సుల్లో చేరేందుకు ఉపయోగపడుతుంది. కొందరు విద్యార్థులు జేఈఈలో ఉత్తీర్ణులైనా ఇంటర్‌లో వచ్చిన మార్కులు తగ్గడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈఏపీసెట్‌లో 25 శాతం వెయిటేజీ పొందవచ్చు. తాజా ఫలితాల్లో మార్కుల శాతం తగ్గిన విద్యార్థులు లోటు పరిస్థితి అధిగమించేందుకు సప్లిమెంటరీపై దృష్టి పెట్టారు.
రెమీడియల్ క్లాసులు..
ఫెయిలైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సర్కారీ కాలేజీల్లో రెమీడియల్ క్లాసులు (పునశ్చరణ తరగ తులు) నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల్లో సందేహాలు, ప్రశ్నలు, జవాబులతోపాటు మోడల్ పేపర్లలో ప్రశ్నలకు సాధన చేయిస్తున్నారు. ఫెయిలైనవారు ఉత్తీర్ణత సాధించడంతోపాటు మార్కులు స్కోరింగ్ చేసేలా ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సమన్వయంతో పనిచేసి విద్యార్ధులను తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్ విద్య అధికారులు సూచిస్తున్నారు.
మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా..
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణతను సాధించేలా రెమీడియల్ క్లాసులను నిర్వహిస్తున్నాం. ఒకవైపు రెమీడియల్ క్లాసులు నిర్వహిస్తూనే మరోపక్క పరీక్షల నిర్వహణపై ఏర్పాట్లు చేస్తున్నాం. సెకెండియర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది సప్లిమెంటరీ విద్యార్థులు గణనీయంగా పెరిగారు. – ఎం.కృష్ణవేణి,
ఇంటర్‌విద్య డీవీఈఓ, శ్రీకాకుళం జిల్లా
ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు పునఃశ్చరణ తరగతుల నిర్వహణ
బెటర్‌మెంట్‌కు దరఖాస్తు చేసిన వారు సైతం హాజరు కావచ్చు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పడిపోయిన ఉత్తీర్ణత శాతం మెరుగుకు చర్యలు
పర్యవేక్షిస్తున్న ఇంటర్ విద్య జిల్లా అధికారులు


