● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో నీటి సమస్యను పరిశీలించిన
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్
● తన వంతుగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తానని హామీ
టెక్కలి: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నీటి సదుపాయం కల్పించలేకపోవడం సిగ్గు చేటని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నీటి సరఫరా సక్రమంగా అందకపోవడంపై శుక్రవారం ‘సాక్షి’ లో వచ్చిన కథనం మేరకు ఆయన ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.సూర్యారావును కలిసి నీటి కొరత పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు అసమర్థతకు ఇది నిదర్శనమన్నారు. బహిరంగ సభల్లో గొప్పలు చెప్పుకుంటూ అర్థం లేని ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై లేని పోని కేసు లు, విచారణలు చేయించడమే మంత్రికి తెలుసు నని తిలక్ అన్నారు.
టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నీటి కొరత తగ్గుముఖం పట్టే వరకు తన సొంత ఖర్చులతో ఆస్పత్రికి ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తానని తిలక్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ యనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు సత్తారు సత్యం, జడ్యాడ జయరాం, అక్కురాడ లోకనాథం, కిల్లి అజయ్‌కుమార్, ఆట్ల రాహుల్ తదితరులు ఉన్నారు.


