108.. మూడంటే మూడే అంకెలు. లక్షలాది ప్రాణాలను కాపాడాయి. రోడ్డుపై నెత్తురోడుతూ ఆఖరి క్షణాల్లో ఉన్న వారికి సైతం పునర్జన్మను అందించాయి. నొప్పులతో విలవిలలాడుతున్న గర్భిణులను మోసుకెళ్లి పసికందులకు కొత్త జన్మనిచ్చాయి. ఎక్కడ ఉన్నా.. ఏ క్షణాన కాల్ చేసినా కుయ్‌కుయ్.. మంటూ శబ్దం చేస్తూ బతుకులను వెలిగించాయి. అలాంటి వాహనాలు ఇప్పుడు నిర్వీర్యమవుతున్నాయి. కాల్ చే స్తే కనెక్ట్ కాని దుస్థితి, కనెక్ట్ అయినా వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్న పరిస్థితులు దాపురించాయి. ఈ ‘కాల్’యాపన వెనుక కారణాలు సర్కారే చెప్పాలి.
అరసవల్లి: దశాబ్దాలుగా ఆపద్బాంధవి అవతారమెత్తి కోట్లాది మందిని ఆదుకున్న 108 వాహనం ఇప్పుడు ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యం బాధితుల ప్రాణాలకు విషంగా మారుతోంది. ఒకప్పుడు ఎప్పు డో గానీ ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మాటిమాటికీ ఈ వాహనాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమయానికి ఎమర్జన్సీ సేవలు అందక గత ఏడాది జిల్లాలో రెండు ప్రాణాలు కోల్పోగా.. ఈ ఏడాది నాలుగైదు ఘటనలు మెరుగైన వైద్యానికి విశాఖప ట్నం రిఫర్ చేశారు.
గత ఏడాది డిసెంబర్ 31న రణస్థలం జాతీయ రహదారిలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. 108 వాహన సేవలకు కాల్ చేస్తే అది తెలంగాణ రాష్ట్ర కాల్‌సెంటర్‌కు కనెక్ట్ అయ్యింది. దీంతో లోకేషన్ చెబుతున్నా తమ పరిధి కాదని చెప్పేశా రు. వారి వాదనల నడుమ ఆ క్షతగాత్రుడు 45 నిమిషాల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ కుక్కకాటు బాధితుడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కుప్పకూలిపోతే ఒకరు 108 వాహనం కోసం కాల్‌లో సంప్రదిస్తే ఏ మాత్రం కాల్ కనెక్ట్ కాలేదని తెలిసింది. ఆఖరుకు ఆస్పత్రికి వెళ్లాక అతడు మృతి చెందిన ఘటన సంచలనమైంది.
నిర్వహణ తీరుపై విమర్శలు
జిల్లాలో మొత్తం 30 మండలాలకు మొత్తం 33 ఎమర్జన్సీ 108 వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాహనాలు రన్నింగ్ స్థితిలో ఉన్నాయి. గతంలో నిర్వహణ బాధ్యతల కంటే తాజాగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన భవ్య సర్వీసెస్ యాజమాన్య పరిధిలో నిర్వహణ చాలా అధ్వానంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కాల్ చేసిన క్షణాల్లో ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్య సహాయం అందేలా చర్యలుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆపద వచ్చిందని కాల్ చేసినా పెద్దగా స్పందన లేదు సరికదా.. కొన్నిసార్లు ఏకంగా ఆ కాల్ తెలంగాణకు కనెక్ట్ చేస్తున్నారంటే నెట్‌వర్క్ నిర్వహణ తీరు ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిస్థితులు ఈ నిర్వహణ తీరుకు అద్దం పడుతున్నాయి. జిల్లాలో రెండు జాతీయ రహదారులున్న నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అందునా అర్థరాత్రి సమయంలోనూ. వేకువజామున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో క్షతగాత్రులు ప్రాణాప్రాయంలో ఉంటే అక్కడివారు 108 సర్వీస్ కాల్ చేస్తున్నా.. అంతసులువుగా కాల్ కనెక్ట్ కావడం లేదు సరికదా...ఇతర రాష్ట్ర నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. మండలానికి ఒక్కో వాహనం ఉన్నప్పుడు కాల్ చేసిన 5 లేదా 10 నిమిషాల్లో ఘటనాస్థలానికి వాహనం చేరిపోవాల్సి ఉంది. జిల్లాలో ఆ పరిస్థితి నేడు లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం 108 వాహనాల ఎమర్జెన్సీ సేవల ప్రాధాన్యతను గుర్తించి నిర్వహణ తీరును మెరుగుపరుచుకుంటే కొందరి ప్రాణాలను కాపాడే పరిస్థితులుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తరచూ ఆలస్యంగా వస్తున్న 108 వాహనాలు
బాధితుల ప్రాణాలతో చెలగాటం
కాల్ వెంటనే కలవదు.. కలిసినా కొన్నిసార్లు
తెలంగాణకు కనెక్ట్


