సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులకు నౌపడలో కేటాయించిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వాసిత కాలనీలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉండిపోయింది. గురువారం ఇళ్ల నిర్మాణాల కోసం మెటీరియల్స్‌తో వస్తున్న ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. కూరుకుపోయిన ట్రాక్టర్ బయటకు రాని పరిస్థితి తలెత్తడంతో మెటీరియల్స్‌ను అక్కడే కిందకు దించారు. ఇక్కడి నుంచి పని చేసే ప్రదేశానికి మెటీరియల్స్ తీసుకుని వెళ్లడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దానికి తోడు అదనపు భారం కూడా తమపై పెడుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత జేసీబీ సాయంతో ట్రాక్టర్ బయటకు తీశారు.


