కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

మాట్లాడుతున్న జి.వి.రమణి

నరసన్నపేట : టీడీపీ అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ లేకుండాపోతోందని, అధికారం అండతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని, దీనికి నిదర్శనం నరసన్నపేటలో తాజాగా జరిగిన ఈ ఘటనే నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ నరసన్నపేట నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జి.వి.రమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆదిలక్ష్మి చెప్పారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయం వద్ద గురువారం మహిళా విభాగం ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి పాలనలో ఒంటరి మహిళలు, వితంతువులు వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా పింఛన్లు ఇవ్వకపోగా పింఛన్లు ఇప్పిస్తామని అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు లైంగిక వేధింపులకు దిగడం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనకు ఎన్నో జరుగుతున్నాయని, ఇది మాత్రమే వెలుగులోకి వచ్చిందన్నారు. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. పింఛన్‌ ఇస్తానని చెప్పి వేధింపులకు గురి చేసిన జగన్నాథపురానికి చెందిన టీడీపీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అన్యాయాన్ని ధైర్యంగా చెప్పిన మహిళకు అండగా నిలిచి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. భయపెట్టి గురువారం ఆమెతో మరో స్టేట్‌మెంట్‌ ఇప్పించారని విమర్శించారు. లైంగిక వేధింపులకు గురైన మహిళకు వైఎస్సార్‌ సీపీ మద్దతుగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు సవర శైలజ, చింతు శ్రీదేవి, తర్ర మాధవి, కై బాడ వాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement