దారి ఖర్చులు ఏవీ? | - | Sakshi
Sakshi News home page

దారి ఖర్చులు ఏవీ?

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

విద్యార్థులను మోసగించిన

చంద్రబాబు ప్రభుత్వం

రవాణా చార్జీలు చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం

శ్రీకాకుళం:

పాఠశాలల విలీనం నేపథ్యంలో విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదు. సమీపంలో పాఠశాలలు లేని గ్రామాల నుంచి వెళ్లే 6–14 ఏళ్ల విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున, ఏడాదికి రూ.6,000 రవాణా భత్యం అందిస్తామని పేర్కొంది. అయితే ఈ హామీ కాగితాలకే పరిమితమైంది.

అమలు ఎక్కడ..?

ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్‌ పరిధిలో లేకపోయినా, ఉన్నత ప్రాథమిక, హైస్కూల్‌ 3 కిలోమీటర్ల దూరంలో లేకపోయినా రవాణా భత్యం ఇవ్వాలని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై గ్రామ సభలు నిర్వహించి, ప్రజల విశ్వాసం పొందుతూ పాఠశాలల విలీనానికి ప్రభుత్వ యంత్రాంగం ముందడుగు వేసింది. కానీ విద్యార్థులను దూర పాఠశాలలకు తరలించిన తర్వాత ఒక్క రూపాయి కూడా రవాణా ఖర్చులుగా చెల్లించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

విలీనం పేరిట విద్యా వ్యవస్థకు దెబ్బ..

పాఠశాలలను ‘తొమ్మిది రకాల విభజన’ పేరిట పునర్‌ వ్యవస్థీకరించి, తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను (3, 4, 5) ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో విలీనం చేయ డంవల్ల గ్రామీణవిద్యార్థులు రోజువారీగా ప్రయాణ భారాన్ని, ప్రకృతి అవరోధాలు భరించాల్సి వస్తోంది. రవాణా భత్యం అందకపోవడంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. దీనివల్ల వేల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ఇంటి వద్దకే వస్తున్న ప్రైవేటు పాఠశాలల బస్సులో తరలిపోతున్నారు.

విద్యా హక్కు చట్టానికి విరుద్ధమా?

ఆర్టీఈ చట్టం (రైట్స్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ టు ఫ్రీ అండ్‌ కంపల్సరీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌) ప్రకారం విద్యార్థులకు సమీపంలో పాఠశాల లేదా రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ రెండింటిలో ఏదీ సరైన విధంగా అమలు చేయకుండా పాఠశాలల విలీనాన్ని ముందుకు తీసుకెళ్లడం చట్టబద్ధ బాధ్యతలపై నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. కాగితాలపై పాఠశాలలు విలీనం అయినట్లు చూపిస్తున్నప్పటికీ, భౌతికంగా విద్యార్థులు ఆ పాఠశాలలకు చేరకపోవడం గమనించాల్సిన అంశం. రవాణా సౌకర్యం లేకపోవడం, రవాణా చార్జీలు చెల్లించకపోవడం వల్ల అనేక విద్యార్థులు విద్యకు దూరమవుతుండటం తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతోంది.

పాఠశాల ఉనికికే ప్రమాదం..

ఈ ఏడాది ఏప్రిల్‌–మేలో చేపట్టబోయే కొత్త విలీన ప్రక్రియతో జిల్లా స్థాయిలో వందలాది పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమలు కాని హామీల నేపథ్యంలో, మరింత పెద్ద స్థాయిలో విద్యార్థుల భవిష్యత్‌ అనిశ్చితిలో పడే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement