రెడ్‌క్రాస్‌ ఔదార్యం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ ఔదార్యం

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

శ్రీకాకుళం కల్చరల్‌ : పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం ఒండ్రుజోల గిరిజన గ్రామానికి చెందిన నిమ్మక ప్రసాద్‌ (36) ఇటీవల కుక్కకాటు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళంలోని సార్వత్రిక ఆసుపత్రిలో వైద్య సహాయం పొందుతూ మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్‌కు బయలుదేరడానికి శ్రీకాకుళం బస్టాండ్‌కు వచ్చిన ప్రసాద్‌ ర్యాబిస్‌ వ్యాధి లక్షణాలతో కుప్పకూలి మృతిచెందాడు. ఒంటరిగా ఉన్న సహాయకుడికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీపంలో ఉన్నవారు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రావుకు తెలియజేశారు. ఆయన అంబులెన్స్‌ ఏర్పాటు చేసి స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా డ్రైవర్‌ చిన్ని కృష్ణ, ఉమా శంకర్‌, రెడ్‌క్రాస్‌ ఎంసీ కమిటీ సభ్యుడు ఎం.కళ్యాణ్‌ చక్రవర్తికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

మేడ పైనుంచి పడి వ్యక్తి దుర్మరణం

పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబాడాం గ్రామానికి చెందిన కురిటి వినోద్‌కుమార్‌ (33) ప్రమాదవశాత్తు ఇంటి మేడ పైనుంచి పడి గురువారం రాత్రి మృతి చెందాడు. రాత్రి 10 గంటల తర్వాత మేడపైకి వెళ్లాడు.. తెల్లారి చూసే సరికి కింద శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వినోద్‌కుమార్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని

రిటైర్డ్‌ ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

పలాస: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన అన్నాబత్తుల వెంకటరమణ అనే రిటైర్డ్‌ ఆర్టీసీ డ్రైవరు గురువారం రామకృష్ణా పురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తన పొలం వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు దాడుతుండగా కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నవధాన్యాలతో నేల సారవంతం

రణస్థలం: నవధాన్యాలు వేసి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌ పూజారి సత్యనారాయణ అన్నారు. రావాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు, ఇతర రైతులకు నేలను సారవంతం చేయడానికి ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నవధాన్యాలు కిట్స్‌ 1400 కిట్లు తయారు చేసి అవగాహన కల్పించారు. ప్రధాన పంట వేసే ముందు కిట్‌లో ఉన్న విత్తనాలు వేయడం వల్ల వేరు వ్యవస్థ నేలలోకి చేర్చుకుని రకరకాల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మొక్కకు కావాలసిన పోషకాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వస్తుందన్నారు. కిట్లు కావాల్సిన వారు రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో విజయభాస్కర్‌, ఎన్‌ఎఫ్‌ఏఐసి టి.శివకృష్ణ, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నరసింహులు, వెంకటలక్ష్మి, ఫార్మర్‌ మాస్టర్‌ ట్రైనర్లు కంబపు కృష్ణ, గంట్యాడ ఏసుబాబు, పెద్దింటి రాజేశ్వరి, కలివరపు శివశంకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement