జెమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్యం | - | Sakshi
Sakshi News home page

జెమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్యం

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

దేశంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్‌ రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ గుర్తింపు

విలేకరులతో జెమ్స్‌–హెచ్‌ చీఫ్‌ పేట్రన్‌ బొల్లినేని భాస్కరరావు వెల్లడి

శ్రీకాకుళం రూరల్‌: రాగోలులోని జెమ్స్‌–హెచ్‌ ఆస్పత్రి వైద్య కళాశాల నుంచి ఇకపై అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు అందిస్తామని జెమ్స్‌–హెచ్‌ చీఫ్‌ పేట్రన్‌ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. తమ కళాశాలకు దేశంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్‌ రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌గా గుర్తింపు రావడంతో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాత శస్త్రచికిత్స సంస్థ రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నుంచి జనరల్‌ సర్జరీ విభాగానికి ప్రతిష్టాత్మక గుర్తింపు వచ్చిందన్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు, రోగుల సంరక్షణపై శిక్షణ ఇచ్చే సీసీఆర్‌ఎల్‌ఎస్‌పీ ప్రొవైడర్‌ కోర్సును జెమ్స్‌ హెచ్‌ ఆస్పత్రిలోనే నెలకొల్పినట్లు వివరించారు. ప్రధానంగా సర్జికల్‌ విద్యకు సంబంధించిన మౌలిక వసతులు, అధ్యాపక బృందం, నాణ్యత ప్రమాణాలు, శిక్షణా విధానాలపై జరిగిన సమీక్షలో జెమ్స్‌ ఆస్పత్రికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. ఆదిత్య ఎడ్యుకేషనల్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌, శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ పి.రఘురామ్‌ మాట్లాడుతూ సర్జరీ విద్యా ప్రమాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఈ గుర్తింపు ఇచ్చిందన్నారు. సీసీఆర్‌ఎల్‌ఎస్‌సీ కోర్సు డైరెక్టర్‌ జీఐ సర్జన్‌ డాక్టర్‌ ఎం.బి.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ కోర్సును మే 7, 8 తేదీల్లో 16 మంది శస్త్ర చికిత్స శిక్షణార్థులకు అనస్తీషీయా విభాగాలకు చెందిన నిపుణుల బృందం శిక్షణ అందిస్తోందన్నారు. ప్రాక్టికల్‌ శిక్షణ, వాస్తవ పరిస్థితుల ఆధారిత అధ్యయనం, క్లినికల్‌ నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించేలా కోర్సు అందిస్తున్నట్లు చెప్పారు. జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్‌, గైనకాలజీ విభాగాల్లో శిక్షణ పొందుతున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జెమ్స్‌ హెచ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీ లలిత, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement