శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ శ్రీకాకుళం 2వ డిపోలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.ఎస్.బాబు, కె.బాబూరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందన్నారు. పని భారం పెంచుతోందన్నారు. ఓవర్ టైం సర్వీసులు రద్దు చేసి సింగల్ డ్యూటీలు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో సెలవు మంజూరు చేయడం లేదని, మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదని, టిక్కెట్ ఇచ్చే యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదని, డిపోలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సీ్త్ర శక్తి కేసులపై న్యాయం చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో డిపో ఉద్యోగులు బి.ఆనందరావు, బి.శేషుబాబు, ఎ.ఈశ్వరరావు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
పాముకాటుతో మహిళ మృతి
వజ్రపుకొత్తూరు: కొండవూరుకు చెందిన యడ్ల ఆదెమ్మ(57) అనే మహిళ పాముకాటుకు గురై బుధవారం మృతి చెందింది. ఉపాధి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకున్న ఆమె విశ్రాంతి తీసుకుంటుండగా ఇంటి ఆవరణలో నాగు పాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదెమ్మ భర్త కొన్నేళ్లు క్రితం అనారోగ్యంతో మృతి చెందగా కుమారుల వద్ద నివాసం ఉంటోంది.


