తప్పు చేస్తూ.. తప్పించుకుంటూ.. | - | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తూ.. తప్పించుకుంటూ..

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

అంబేడ్కర్‌ యూనివర్సిటీలోని లైబ్రరీ సైన్స్‌ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి ఇన్విజలేషన్‌ సమయంలో జవాబుపత్రంలో సంతకం చేసినప్పుడు విద్యార్థి ని చేయిపట్టుకున్నారు. అప్పట్లో యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు కూడా వెళ్లింది. దీనిపై కమిటీ కూడా వేశారు. కానీ, ఆయనపై చర్యలు తీసుకోకుండా ఇకపై పునరావృతం కాకుండా ఉంటానని చెప్పి లెటర్‌ తీసుకుని వదిలేశారు.

● లా ఎగ్జామినేషన్‌లో సబ్జెక్ట్‌ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న ఒకాయన విద్యార్థిని ఫోన్‌ నంబర్‌ సంపాదించి అసభ్యకర మెసెజ్‌లు పెట్టారు. విషయం తెలుసుకుని ఆ విద్యార్థిని భర్త నేరు గా వర్సిటీకి వచ్చి సదరు ఉద్యోగిని కొట్టారు. ఇంత జరిగినా ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోలేదు. రాజీ ధోరణితో వదిలేశారు.

● నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లో అటెండర్‌గా వేశారు. అక్కడ చేతివాటం ప్రదర్శించారు. పాస్‌ చేయిస్తానని చెప్పి యూనివర్సిటీకి చెందిన మాజీ ఉద్యోగి బంధువు నుంచి రూ.20 వేలు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై ఏకంగా యూనివర్సిటీ అధికారులకు సదరు మాజీ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగిని మందలించి వదిలేయడంతో పాటు నెలకు రూ.3వేలు చొప్పున ఆ విద్యార్థికి ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చారు.

ఇలా చెప్పుకుంటూపోతే అంబేడ్కర్‌ యూనివర్సిటీలో జరిగిన బాగోతాలు ఎన్నో.. ఓవైపు విద్యార్థినులపై వేధింపులు.. మరోవైపు పరీక్షలు పాస్‌ చేస్తామంటూ, మంచి మార్కులు వేయిస్తామంటూ అడ్డగోలు వసూళ్లు.. ఇక, విద్యార్థినులపై ర్యాగింగ్‌ చేస్తున్నారన్న ఫిర్యాదులు అనేకం. వీటిన్నింటి విషయంలో యూనివర్సిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించి రాజీలు, మందలింపులతో వదిలేస్తున్నారు. దీంతో ఎవరికీ భయం లేకుండా పోయింది. ఏం చేసినా రాజీ చేసేస్తారులే.. చర్యలేమీ ఉండవనే ధోరణికి చాలా మంది వచ్చేశారు. అలవాటుగా తప్పులు చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ఫోన్‌లో మాట్లాడిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మజ్జి రామారావు విషయంలోనూ అదే జరిగింది. అతగాడి తీరుపై ఒకసారి యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు వెళ్లింది. కానీ అటు విద్యార్థిని, ఇటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మధ్య రాజీ కుదిర్చారు. కానీ, ఆ ఆధ్యాపకుడు మరింత బెదిరింపులకు దిగడంతో తప్పని పరిస్థితుల్లో ఫోన్‌ సంభాషణ ఆడియోను బయటకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విభేదాలతో గుట్టురట్టు..

ఆ ఆడియో లీక్‌లు, యూనివర్సిటీలో జరుగుతు న్న వ్యవహారాలు బయటికొస్తున్నాయంటే అక్కడి అధ్యాపకులు, ఉద్యోగుల్లో కొందరి మధ్య ఉన్న విభేదాలే కారణం. చాలామందిపై వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఒకరినొకరు దెబ్బకొట్టుకోవడానికి అదును చూస్తున్నారు. ఎప్పుడైతే తనకు పడని వ్యక్తి అడ్డంగా దొరుకుతున్నాడో అవకాశం వదులుకోకుండా బాగోతాలను బయటపెడుతున్నారు. లేదంటే యూనివర్సిటీలో అన్నీ గుట్టుగానే కనుమరుగైపోయేవి.

అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయంలో కొనసాగుతున్న రాజీల పర్వం

కళంకితులపై కానరాని చర్యలు

విస్మయం కలిగిస్తున్న అధికారుల

తీరు

పునరావృతమవుతున్న ఘటనలు

యూనివర్సిటీలో రాజీలేంటి?

ప్రతిష్టాత్మకమైన అంబేడ్కర్‌ యూనివర్సిటీలో తప్పు చేసిన వారిని కాపాడేందుకు రాజీలు చేయడమేంటో అర్థం కావడం లేదు. తప్పు చేసిన వారిలో ఒకరిపై వేటు పడితే.. మరొకరు భయపడి తప్పు చేయడానికి వెనకాడుతారు. కానీ, ఇక్కడ తప్పు చేసిన వారిని వెనకేసుకొచ్చేలా రాజీలు చేయడం, మందలించి వదిలేయడం, బాధితులకు నష్టపరిహారం అందించడం వంటివి జరగడం విస్మయం కల్గిస్తోంది. పర్యవేక్షక అధికారులు చేయాల్సిన పని ఇదేనా? అన్న ఆరోపణలకు అవకాశం ఇస్తోంది. యూనివర్సిటీ ప్రతిష్టను మంటగలుపుతున్న కళంకితులను సస్పెండ్‌ చేయడమో.. ఏకంగా డిస్మిస్‌ చేయడమో జరిగితే.. భవిష్యత్‌లో విద్యార్థినుల జోలికై నా, అక్రమాలకు పాల్పడటానికై నా భయపడతారు. అటువంటిది లేకుండా ఉండటంతో ఇష్టారీతిన, అసభ్యకరంగా వ్యవహరిస్తూ అక్రమాలకు సైతం పాల్పడుతున్నారు. పాస్‌ చేయడానికి, మార్కులు వేయడానికి డబ్బులు అడుగుతున్నారంటే ఇక్కడ పరీక్షల తీరుపై కూడా అనుమానాలు నెలకొంటున్నాయి. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం చేసినట్టే అవుతోంది. పరీక్షలు కూడా విశ్వసనీయత కోల్పోతాయి.

Advertisement
 
Advertisement
Advertisement