● కేజీబీవీల్లో వింతపోకడ.. బలవంతపు బదిలీలకు శ్రీకారం
● రెండు రోజుల సమయం ఇస్తూ ఉద్యోగులకు వాట్సాప్ మెసేజ్‌లు
● ఆదేశాలు పాటించకపోతే రెన్యువల్ చేయబోమని బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
రాష్ట్రవ్యాప్తంగా 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) బదిలీల ప్రక్రియ ఇష్టారాజ్యంగా మారిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా, కనీసం లిఖితపూర్వక ఉత్తర్వులు విడుదల చేయకుండా బలవంతపు బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు వారు విమర్శిస్తున్నారు. వీరు తెలిపిన సమాచారం ప్రకారం బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని ఒకటి నుంచి రెండు రోజులు సమయం ఇస్తూ వాట్సాప్‌లో ఉద్యోగులకు వాట్సాప్ మెసే్‌స్జ్‌లు అందాయి. ఒకవేళ దరఖాస్తులు పెట్టుకోకపోయినా.. దూర ప్రాంతాలకు బదిలీ తప్పదని మెసేజ్‌ల సారాంశం. పైగా ఇలాంటి వారికి రెన్యువల్ కూడా ఉండదని హెచ్చరికలు జారీ అయ్యాయి. సమగ్ర శిక్షా అభియాన్‌లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
హైకోర్టు చీవాట్ల నుంచి తప్పించుకోడానికే..!
కేజీబీవీల్లో పనిచేసే ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు కావడం లేదు. కనీసం హెచ్‌ఆర్‌ఏ లేదు. అలవెన్సులతో కూడిన వేతనాలు లేవు. ఈ డిమాండ్లతో పాటు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి బదిలీలు చేయాలని కేజీబీవీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు పట్టించుకోకుండా కొన్ని జిల్లాల్లో బదిలీలు చేస్తుండటంతో స్టేట్ ప్రాజెక్టు ఆఫీస్ డైరెక్టర్‌పై పలు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టులో సమాధానం చెప్పుకోవడానికి అధికారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నుంచి బలవంతంగా దరఖాస్తులు తీసుకుని.. వారి ఇష్టపూర్వకంగానే బదిలీ చేశామని కోర్టులో చెప్పుకోవడానికి పన్నిన కుట్రలో భాగమే ఇదంతా అని ఉద్యోగులు భావిస్తున్నారు.
అధికారులు తీరు సరికాదు
బెదిరింపులతో నిర్బంధ బదిలీలు చేస్తున్న సమగ్ర శిక్షా అధికారుల తీరు దారుణం. బదిలీకి దరఖాస్తు చేయకపోతే రెన్యువల్ చేయ బోమని బెదిరిస్తున్నారు. ఇప్పటికై నా హైకోర్టు తీర్పును అమలు చేస్తూ, జీవో నంబర్ 24, 40,5, 2 ప్రకారం మినిమం టైమ్ స్కేల్, హెచ్‌ఆర్‌ఏ ఇచ్చి నోటిఫికేషన్ ద్వారా బదిలీలు చేయాలి.
– కె.రత్నమాలిని దేవి, కేజీబీవీ రాష్ట్ర
ఉపాధ్యాయ సంఘం అధ్యక్షురాలు, ప్రకాశం జిల్లా


