నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నరసన్నపేటలో ఆక్రమణలు హెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వ స్థలం, చెరువు గర్భం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. నేరుగా టీడీపీ కార్యకర్తలే ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే శివనగర్ కాలనీలో ఒక టీడీపీ నాయకుడు చెరువు గర్భంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. తాజాగా మరో టీడీపీ కార్యకర్త మెయిన్ రోడ్డుకు ఆనుకొని వంశధార కార్యాలయం ఎదురుగా ఉన్న పాలకర్ర(శర్మాల) చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. గొట్టిపల్లి రెవెన్యూ పరిధి 178/2సీ సర్వే నంబర్‌లో పాలకర్ర చెరువు ఉంది. అటు జాతీయ రహదారి.. ఇటు పట్టణంలోని మెయిన్ రోడ్డుకు మధ్యన ఉన్న ఈ చెరువుపై ఇప్పుడు ఆక్రమణదారుల(టీడీపీ నాయకుల) కన్నుపడింది. టీడీపీ కార్యకర్త ఒకరు ఇందిరాగనర్‌లో ఒక ప్రైవేటు స్కూల్ ఎదురుగా ఉన్న కాలువ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ఈ ఆక్రమణను తొలగించారు. దీంతో ఈ కార్యకర్త స్థానిక టీడీపీ నాయకులను పట్టుకొని ఎమ్మెల్యే ఆశ్రయాన్ని కోరగా.. ఆయన పాలకర్ర చెరువులో రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలంలో బడ్డీ పెట్టుకోమని సలహా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఆ కార్యకర్త రోడ్డుకు ఆనుకొని ఉన్న చెరువు స్థలంలో ఒక ఐదు సెంట్లు ఆక్రమించాలనే ఉద్దేశంతో ఇటీవల బడ్డీ పెట్టారు. ఈ సమాచారం రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.
– ఎంతో విలువైన స్థలం
పాలకర్ర చెరువు 9 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. దీనిలో కొంతభాగం జాతీయ రహదారిలో కలిసిపోయింది. మిగిలిన 5 ఎకరాలు రెండు రహదారులకు మధ్య ఉంది. ఇప్పటికే చెరువు గర్భాన్ని గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమందికి ఆక్రమణలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మరికొందరికి ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఇక్కడ అడుగు స్థలం రూ.లక్ష పైనే ఉంది. ఈ కార్యకర్త కన్నేసిన స్థలం విలువ రూ.50 లక్షలు పైనే ఉంటుంది. దీంతో టీడీపీ నాయకుల కన్ను ఈ చెరువుపై పడింది. ఈ కార్యకర్తను అడ్డుపెట్టుకొని మిగిలిన రోడ్డు పక్కన ఉన్న మిగిలిన స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు ఒక వైపు ముఖ్యమంత్రి పర్యటన పనుల్లో బిజీగా ఉండగా.. ఇదే అదునుగా భావిస్తున్న టీడీపీ కార్యకర్త బడ్డీ స్థలంలో పక్కాగా నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి ఆక్రమణలను అడ్డుకోవాలని ప్రభుత్వ స్థలాలు, చెరువులను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఒక వైపు ప్రభుత్వం ఉపాధి నిధులతో చెరువులను లోతు చేస్తుంటే.. అధికార కూటమి నాయకులు, కార్యకర్తలు మాత్రం చెరువులను చెరబడుతున్నారు. అందువలన తగిన చర్యలు తీసుకొని వెంటనే పాలకర్ర చెరువు ఆక్రమణలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నరసన్నపేటలో పాలకర్ర చెరువు ఆక్రమణ
చెరువు గర్భంలో బడ్డీ ఏర్పాటు
పట్టించుకోని రెవెన్యూ అధికారులు


