ఉద్దానం విధ్వంసానికే కార్గో ఎయిర్‌పోర్టు | - | Sakshi
Sakshi News home page

ఉద్దానం విధ్వంసానికే కార్గో ఎయిర్‌పోర్టు

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్ష చేసిన కార్గో ఎయిర్‌పోర్టు పోరాట కమిటీ ప్రతినిధులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: కార్గో ఎయిర్‌పోర్టు పేరు తో ఉద్దానంలో విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు మండిపడ్డారు. కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని, సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పొ ద్దని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద గల జ్యోతీరావు పూలే పార్కు వద్ద కార్గో ఎయిర్‌పోర్ట్‌ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షతన నిరశన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్‌పోర్ట్‌ పేరుతో లక్షలాది జీడి, కొబ్బరి మునగ చెట్లు నరకడం వల్ల వాటిపై ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్న వేలాది మంది జీవనానికి ముప్పు ఏర్పడుతుందని, పర్యావరణానికి సైతం తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నా రు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడికి ఇక్కడి పరిస్థితులు, వాతావరణం, సహజ సంపద, మత్స్యకారుల జీవన విధానం తెలియదా అని ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్‌ నాయుడు ఈ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టుల కోసం ఒక్క పైసా అయినా ఎందుకు తేలేదని వారు ప్రశ్నించారు. అణు విద్యుత్‌ కేంద్రం, పచ్చటి పొలాల్లో కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో ప్రజల భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడమే వీరికి ప్రధాన లక్ష్యమైపోయిందని విమర్శించారు. జూన్‌ 6వ తేదీన చలో ఉద్దా నం కార్యక్రమం చేపట్టి రాంపురంలో ర్యాలీ బహి రంగ సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతాడ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, పౌర హక్కుల సంఘం నాయకులు పత్రి దానేషు, ఆంధ్ర ప్రదేశ్‌ జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ అజయ్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పొందూరు చంద్ర రావు, పోలాకి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement