పాలిసెట్‌లో 91.96 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో 91.96 శాతం ఉత్తీర్ణత

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

సత్తా చాటిన సిక్కోలు విద్యా కుసుమాలు

ఈసారీ బాలికలదే పైచేయి

శ్రీకాకుళం న్యూకాలనీ: పాలిసెట్‌–2026 ఫలితాల్లో శ్రీకాకుళం విద్యార్థులు సత్తాచాటారు. వివిధ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల పొందేందుకు నిర్వహించిన పాలిసెట్‌ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 91.96 శాతం ఉత్తీర్ణత సాధించి క్వాలిఫై అయ్యారు. పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25వ తేదీన జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే.

11218 మందికి.. 10316 క్వాలిఫై..

జిల్లా నుంచి పాలిసెట్‌–2026కు 11218 మంది విద్యార్థులు హాజరుకాగా.. 91.96 శాతం ఉత్తీర్ణతతో 10,316 మంది క్వాలిఫై అయ్యారు. 6205 మంది బాలురు పరీక్ష రాయగా.. 90.48 శాతం ఉత్తీర్ణతతో 5614 మంది పాసయ్యారు. అలాగే 5013 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా.. 93.80 శాతం ఉత్తీర్ణతతో 4702 మంది క్వాలిఫై అయ్యారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా బాలురు కంటే.. బాలికలే (3.32 శాతం ఎక్కువ)మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు

26వ ర్యాంకు

జలుమూరు: చల్లవానిపేట పంచాయతీ పంగపేటకు చెందిన చిన్నాల లోహిత్‌ పాలిసెట్‌లో 120 మార్కులకు గాను 119తో రాష్ట్ర స్థాయిలో 26వ ర్యాంక్‌ సాధించాడు. తల్లి కృష్ణకుమారి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా తండ్రి కన్నయ్య వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఈ విద్యార్థి తూర్పుగోదావరి జిల్లాలో టెన్త్‌ చదివాడు.

69వ ర్యాంకుతో..

నరసన్నపేట: దూకులపాడు, రెడ్డికిపేటలకు చెందిన విద్యార్థులు పాలిసెట్‌లో ప్రతిభ చూపారు. దూకులపాడుకు చెందిన ముద్దాడ పవన్‌ కుమార్‌ రాష్ట్ర స్థాయిలో 69 వ ర్యాంకును పొందారు. తల్లిదండ్రులు కృష్ణారావు, దమయంతి ఆనందం వ్యక్తం చేశారు. రెడ్డికిపేటకు చెందిన కురిమిన ఢిల్లీశ్వరి 102 వ ర్యాంకును సాధించింది. దీంతో తల్లిదండ్రులు రామకృష్ణ, ఉషారాణిలు ఆనందం వ్యక్తం చేశారు. టెన్త్‌లో వీరిద్దరూ 584 మార్కులు పొందిన విషయం తెలిసిందే. తూలుగు జోత్స్న 118 మార్కులతో 136వ ర్యాంకు సాధించి మెరిసింది.

Advertisement
 
Advertisement
Advertisement