గిట్టుబాటు ధరల కల్పనలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధరల కల్పనలో ప్రభుత్వం విఫలం

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట: అన్నదాతలు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతులు నష్టాల పాలవుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టాల చవిచూస్తున్నారని ముందుగా కూట మి ప్రభుత్వానికి హెచ్చరించినా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కృష్ణదాస్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రాబోయే మూడు రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉన్నా రైతులకు కష్టాలు తప్పడం లేదన్నా రు. మొక్కజొన్న, రబీ వరి రైతులకు మద్దతు ధర అందడం లేదని, మొక్కజొన్న అమ్మకాల్లో రైతులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2400 ఉంటే దళారులు కేవలం రూ. 1800 లకు కొనుగోలు చేస్తున్నారని, ఒక బస్తా వద్ద రైతులు రూ.600 వరకూ నష్టపోతున్నారని వివరించారు. అలాగే వరి రైతులకు కూడా మద్దతు ధర అందడం లేదన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు తమ పరిధిలో ఉన్న రైతు సంఘాల నాయకులతో సమన్వయం చేసుకొని రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వండి

కూటమి నాయకులు రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై నీచంగా విమర్శలు చేస్తున్నారని కృష్ణదాస్‌ మండి పడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఉదాసీనంగా ఉండరాదని, అడ్డుగోలుగా మాట్లాడితే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అక్కడ స్పందన లేకపోతే ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు రశీదు పత్రాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement