కొన్ని ప్రమాదాలు
● మార్చిలో ఎల్‌ఎన్‌పేట మండలం తురకపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపారావు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
● జనవరిలో ఎల్‌ఎన్‌పేట మండలం తురకపేట జంక్షన్ వద్ద అలికాం–బత్తిలి రోడ్డుపై ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బస్సు పొలాల్లోకి దూసుకుపోయింది. విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి.
● నాలుగు నెలల కిందట ఎల్‌ఎన్‌పేట మండలం శ్యామలాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యుగంధర్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
● ఎల్‌ఎన్‌పేట మండలం కరకవలస మాజీ సర్పంచ్ బి.జనార్దనరావు తురకపేట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు.
● ఇరుకుగా అంతర్ రాష్ట్ర రహదారి
● హైవేగా గుర్తించాలన్న ప్రతిపాదనలు బుట్టదాఖలు
● కనీసం విస్తరణకు నోచుకోని వైనం
● తరచూ ప్రమాదాలతో భయపడుతున్న జనం
హిరమండలం: అలికాం–బత్తిలి రోడ్డు ప్రయాణికులను భయపెడుతోంది. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గార మండలం అలికాం నుంచి ఒడిశాలోని గుణుపూర్ వరకూ 118 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి ఉంది. ఇది అంతర్ జిల్లా, రాష్ట్ర రహదారి. శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన మండలాలను కలుపుతూ ఉంది. ఆపై విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి రహదారులకు అనుసంధానమైనది. ఆపై ఒడిశాలోని హడ్డుబంగి, గుణుపూర్ రోడ్లకు సైతం ఇది అనుసంధానమై ఉంది. ప్రతిరోజూ సగటున 5 వేల వరకూ వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఏటికేటా వాహనాల సంఖ్య పెరుగుతున్నా.. రోడ్డు విస్తరణకు మాత్రం నోచుకోలేదు. జిల్లాలో ఇతర రోడ్లు విస్తరిస్తున్నా ఎంతో ప్రాధాన్యం ఉన్న అలికాం–బత్తిలి రోడ్డుపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు.
ఐదేళ్ల కిందట ప్రతిపాదనలు..
అలికాం–బత్తిలి రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలన్న ప్రతిపాదన చాలా ఏళ్ల నుంచి ఉంది. రెండు లేదా నాలుగు లేన్లగా విస్తరించాన్న ప్రతిపాదన 2021లోనే కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ ఇంతవరకూ ఆమోదం లభించలేదు. మధ్యలో ఒకసారి కొలతలు కూడా తీశారు. తర్వాత పట్టించుకోవడం మానేశారు. కనీసం ఈ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. ఆమదాలవలస మునిసిపాలిటీ, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు మండల కేంద్రాల్లో మాత్రమే రోడ్ల విస్తరణ జరిగింది.
మిగతా చోట్ల సింగిల్ లైన్‌గా ఉంది. దీంతో ఎదురెదురుగా వచ్చే బస్సులు, లారీలు తప్పించుకునే పరిస్థితి లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆ రెండు రోడ్లపైనే దృష్టి..
జిల్లాకు సంబంధించి కళింగపట్నం–పాలకొండ–పార్వతీపురం మీదుగా రాయగడకు ఉన్న 145 కిలోమీటర్ల రోడ్డును నేషనల్ హైవేగా గుర్తించాలన్న ప్రతిపాదన సైతం కేంద్రం వద్ద ఉంది. ఇంకోవైపు చిలకపాలెం నుంచి రామభద్రపురం మీదుగా రాయగడకు 100 కిలోమీటర్ల రోడ్డు ఉంది. దీన్ని సైతం నేషనల్ హైవేగా గుర్తించాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిన రహదారిని విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ జాబితాలో అలికాం–బత్తిలి రోడ్డు లేకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోడ్డు ఇరుకున ఉండడంతో శ్రీకాకుళం రూరల్, గార, ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు మండలాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
తరచూ ప్రమాదాలు..
మా చిన్ననాటి నుంచి అలికాం–బత్తిలి రోడ్డు ఇలానే ఉంది. ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణం జాతీయ రహదారిగా గుర్తించి విస్తరించాల్సిన అవసరం ఉంది.
– పెనుమజ్జి విష్ణుమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు, ఎల్‌ఎన్‌పేట
భయం వేస్తోంది..
ఈ రహదారిపై ప్రయాణమంటేనే భయం వేస్తుంది. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కూడా తప్పించుకునేందుకు వీలుండదు. జిల్లాలో ఇతర రహదారులను విస్తరించారు. కానీ రహదారి విషయాన్ని మాత్రం మరిచారు. ఇప్పటికై నా దృష్టిపెట్టాలి.
– రెడ్డి సురేష్, ఎల్‌ఎన్‌పేట
కేంద్రానికి నివేదించాం..
అలికాం–బత్తిలి రోడ్డును విస్తరించడంతో పాటు జాతీయ రహదారిగా గుర్తించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి వెళ్లింది. కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే చర్యలు ప్రారంభిస్తాం. రోడ్డు విస్తరణ పనులు చేపడతాం.
– సత్యనారాయణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ,శ్రీకాకుళం


