● కూలి పనులకు వచ్చి చెరువులో పడి యువకుడు మృతి
టెక్కలి రూరల్: కూలి పని కోసం ఊరి కాని ఊరు వచ్చిన ఆ యువకుడి ఆయుష్షు ఇక్కడే అయిపోయింది. టెక్కలి మండలం కాంట్రగడ గ్రామం వద్ద సోమవారం సాయంత్రం చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లా జొన్నగుడ్డి గ్రామానికి చెందిన కె.భానుప్రకాష్ (19) టెక్కలి మండలం కాంట్రగడ గ్రామంలో జరిగిన ఒక వివా హ వేడుకకు లైటింగ్, షామియానాల డెకరేషన్ చేసేందుకు సహచరులతో కలిసి 15 రోజుల కిందట వచ్చాడు. రెండు రోజుల కిందట పెళ్లి జరిగింది. తిరిగి తమ సామాన్లు వ్యాన్‌లోకి ఎక్కించుకుని జిల్లాకు వెళ్లిపోవాలనుకున్నారు. ఈ లోగా సోమవారం గ్రామం వద్ద ఉన్న చెరువుకి స్నానానికి వెళ్లారు. ఆ చెరువులో దిగిన భాను ప్రకాష్ లోపలకు వెళ్లి మునిగిపోయాడు. రెండు చేతులూ ఊపుతూ కాపాడాలని వేడుకున్నాడు. ఇది చూసిన తోటి స్నేహితులు చెరువంతా గాలించినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తుల సహాయంలో చెరువులో వెతికారు. కాసేపటి తర్వాత చెరువు లోపల అతను లభ్యం కా వడంతో బయటకు తీసుకు వచ్చారు. అనంతరం 108లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహరాజ్ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆ యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.


