శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమ వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండియాతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వేదికలో సాయంత్రం వరకు మొత్తం 122 ఫిర్యాదులు నమోదయ్యాయి. పొందూరు మండలం కింతలికి చెందిన వి.శివకుమార్ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగాడు. తన భూమి వేరే పేరు మీద 1–బి రికార్డులో వస్తోందని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపించాడు.
సోంపేట మండలం, కొర్లాం గ్రామంలోని భూముల విషయమై అధికారులపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, రైతులు ఫిర్యాదు చేశారు.


