భయమేస్తోంది..
బస్టాండ్‌లో దుర్గంధం
● బాటిళ్లు పగులగొట్టి పడేసిన వైనం ● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
మెళియాపుట్టి: బస్ షెల్టర్ వద్ద మందుబాబుల ఆగ డాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. వికృత చేష్ట లు చేస్తూ.. తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారు. పగలగొట్టిన మద్యం బాటిళ్లు, చెత్తాచెదారాలు వేస్తున్నారు. సమస్య పరిష్కరించకపోతే ఇబ్బందులు తప్పవని ప్రయాణికులు చెబుతున్నారు. జాడుపల్లి గ్రామంలో మారడికోట పంచాయతీకి వెళ్లే పూల సారి రహదారి కూడలిలో ఓ బస్టాండ్ ఉంది. పలు గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే అక్కడే వేచి చూడాలి. కొత్త మారడికోట, పాతమారడికోట, ఎర్రమానుగూడ, సవర పోలూరు, నందలపాడు, పుస్తిలవార, సన్నిబంద, అచ్చనాపురం, రాజపురం, పూలసారి తదితర గ్రామాలకు వెళ్లడానికి అదే బస్ షెల్టర్‌లో ప్రయాణికులు రోజూ వేచి చూస్తుంటారు. ఆ రహదారిలో ఒక్క బస్ సర్వీస్ కూడా లేదు. ఆటోల్లో ప్రయాణించాల్సిందే. అదే బస్ షెల్టర్‌లో మందుబాబులు మద్యం సేవిస్తూ అక్కడే బాటిళ్లు పగలగొట్టి గాజుముక్కలు చెల్లాచెదురుగా పడేస్తున్నారు. దీంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి అసభ్య కార్యకలాపాలు నివారించకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
ఒక్కో రోజు సాయంత్రం వేళల్లో మా గ్రామానికి చేరుకోవాలంటే ఆటోలు రావడానికి చాలా సమయం పడుతుంది. అక్కడ బస్టాండ్‌లో వేచి చూడాల్సి వస్తుంది. మద్యం బాటిళ్లతో కొంతమంది బస్టాండ్‌కు వచ్చి కూర్చుంటే భయమేస్తోంది. తోడులేకుండా అక్కడ కూర్చోలేం. ఇలాంటివి జరగకుండా చూస్తే మంచిది.
– సుభద్రమ్మ, మారడికోట గ్రామం
పగలగొట్టిన మద్యం సీసాలు, తిని వదిలేసిన చిరుతిళ్లు ఇతర చెత్త చెదారాలతో బస్టాండ్ ఆవరణ నిండిపోయి ఉంటుంది. దుర్గంధానికి ఉండలేకపోతున్నాం. ఇక్కడ రోజూ ఇదే తంతు. మండుటెండలో కాసేపైనా విశ్రాంతి తీసుకుందామనుకున్నా ఇక్కడ ఉండలేకపోతున్నాం.
– కనక మహాలక్ష్మి, సీడిపాలెం గ్రామం


