పాతపట్నం: పాతపట్నం రైల్వే గేటు వద్ద ఆదివారం అండర్ టన్నెల్ నిర్మాణం పనులు వేగవంతంగా చేపట్టారు. నాలుగు రోజుల పాటు వాహనాలను, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకుని కేవలం ఐదు గంటల సమయంలోనే పనులు పూర్తి చేశారు. ఉద యం గుణుపూర్–పూరి రైలు వెళ్లాక 7 గంటలకు నిర్మాణం పనులు అధికారులు ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ముమ్మరంగా నిర్మాణం పనులు చేపట్టారు.
నిర్మాణ పనుల వల్ల విశాఖపట్నం–గుణుపూర్ రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖపట్నం–గుణుపూర్ రైలు నౌపడ వరకు వచ్చి, అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్లింది. గుణుపూర్–పూరి, పూరి–గుణుపూర్, రూర్కెలా–గుణుపూర్, గుణుపూర్–రుర్కెలా (రాజారాణి ఎక్స్‌ప్రెస్) రైళ్లు యథావిధిగా నడిచాయి. అండర్ టన్నెల్ నిర్మాణం కోసం భారీ క్రెయిన్‌లు రెండు, జేసీబీలు ఆరు, రైల్వే ఉన్నతాధికారులు పది మంది, దిగువ స్థాయి సిబ్బంది సుమారు 30 మంది, జాతీయ రహదారి హైవే అధికారులు, రైల్వే కార్మికులు సుమారు 100 మంది నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు.
రైల్వే అధికారులు విశాఖపట్నం–గుణుపూర్ రైలు నిలిచిపోతుందని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


