ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో ఆదివారం వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జీఆర్‌పీ ఎస్‌ఐ జి.మదుసూధనరావు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 12840 నంబరు గల చెన్నయ్–హౌరా రైలు వెళ్తుండగా పట్టణ శివార్లలో పాత గేటు వద్ద ట్రాక్‌పై ఆ రైలు కింద పడి ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి ఒకటోవార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన గేదెల జగన్నాథం (59) మృతిచెందారు. ఈయన భిక్షాటనం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు.
రైలు నుంచి దిగుతూ..
శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం శివార్లలో వాస్కోడి గామా 18047 రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కోల్‌కతా వెళ్లాల్సిన ఈ వ్యక్తి వాస్కోడి గామా రైలు ఎక్కి మళ్లీ దిగేందుకు ప్రయత్నించగా రైలు కింద పడి మృతిచెందినట్లు జీఆర్‌పీ పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యక్తి సుమారు 48 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఆచూకీ తెలిసిన వారు శ్రీకాకుళం రోడ్ జీఆర్‌పీ సంప్రదించాలని వారు కోరారు.


