వజ్రపుకొత్తూరు: మండలంలోని దేవునల్తాడకు కరెంటు కష్టాలు వీడడం లేదు. గత మూడు రోజులుగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని ఎంపీటీసీ సభ్యుడు సౌదాల వెంకన్న, మాజీ ఎంపీటీసీ గాలి షణ్ముఖరావు తెలిపారు. ఈదురు గాలులకు, వర్షానికి గ్రామం అంధకారంలోకి వెళ్లిపోయిందని, ఆదివారం సాయంత్రం వర కు గ్రామానికి విద్యుత్ సరఫరా లేకపోవడం బాధాకరమన్నారు. ఒకప్పుడు పూండి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఫీడర్ సేవలు అందేవని, ప్రస్తుతం సంతబొమ్మాళి మండలం నౌపడ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవతుండడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
‘నీట్’గా ముగిసింది
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో నీట్ యూజీ– 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1951 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరుకావాల్సి ఉండగా 97.59 శాతంతో 1904 మంది పరీక్ష రాశారు. 47 మంది వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఇతర జిల్లా అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఉద్యానవన పంటల ప్రాజెక్టులకు రూ.వంద కోట్లు రాయితీ
పలాస: ఉద్యానవన పంటల ప్రాజెక్టులకు గరిష్టంగా రూ.100కోట్లు రాయితీ ఇస్తున్నట్టు గుంటూరు ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ వై.విద్యాశంకర్ చెప్పారు. కాశీబుగ్గలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం వ్యాపారులకు, రైతులకు జీడి మామిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి 16 ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం దృష్టికి తీసుకొని వెళ్లగా 13 ప్రాజెక్టులకు రూ.1890 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అందులో మామిడి, ఖోఖో, అరటి, మునగ, మిరప, పసుపు ఉన్నాయన్నారు. పలాసలో 250 జీడి పరిశ్రమలు ఉన్నా జిల్లాలో జీడి పిక్కల సాగు 40శాతమేనని చెప్పారు. 60 శాతం పిక్కలు ఇతర దేశాలవేనని తెలిపారు.
మెళియాపుట్టి: పెద్దమడిలో ఉన్న గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల (బాలుర)లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఒక్కో గూపులో 40సీట్లు ఉన్నాయని, చేరడానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సీతంపేట ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, కౌన్సిలింగ్ నిమిత్తం ఈనెల 26న సీతంపేటలోని ఏపీటీడబ్ల్యూ జూనియర్ కళాశాలకు రావాలని తెలిపారు.


