తల్లిదండ్రులు అక్కున చేర్చుకోవాలి..
ఫలితాలు విడుదలైన ఎలాంటి సమయంలోనైనా సరే తల్లిదండ్రుల పాత్రే కీలకం. ఫెయిలైన విద్యార్థులను, అనుకున్న మార్కులు సాధించలేకపోయిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు అక్కున చేర్చుకోవాలి. మానసికంగా వారిని ధృడంగా చేసి.. వారికి తామంతా అండగా ఉన్నామనే విషయాన్ని నేరుగా మాటల రూపంలో వారికి తెలియజేయాలి. వీలైతే బయటకు తీసుకెళ్లాలి. ఆందోళనను తగ్గించేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
– జీఆర్ మల్లికార్జునరావు,
మానసిక వైద్య నిపుణుడు, శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ:
వాడి కంటే నీకు తక్కువ మార్కులు వచ్చాయి...
అందరూ పాసయ్యారు.. నువ్వు తప్ప..
ఇప్పుడే తప్పితే ఇంకేమీ లేదు..
ఫలితాలు వచ్చిన వెంటనే చాలా ఇళ్లలో వినిపించే మాటలివే.
టెన్త్, ఇంటర్ ఫలితాలు వెలువడడంతో ఈ మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కానీ నిపుణులు మాట మరోలా ఉంది. టెన్త్‌లో ఫెయిలైన వారు, తక్కువ మార్కులు తెచ్చుకున్న వారిలో చాలా మంది తమ తోటి వారి కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారని వారు చెబుతున్నారు. పది పరీక్షలతోనే జీవితం ఆగిపోదని, తక్కువ మార్కులే వచ్చినా, ఉత్తీర్ణత సాధించకపోయినా ఆపై తరగతుల్లో పోరాడి విజయం సాధించిన వారు ఎందరో ఉన్నారని అంటున్నారు.
జిల్లాలో చాలా మంది విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధించారు. మరికొంతమంది బాగా రాసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో మార్కులు స్కోర్ చేయలేకపోయారు. ఇంకొంతమంది వివిధ కారణాలు, అనారోగ్య కారణాలు, ప్రమాదాలు, తప్పిదాలు ఇతరత్రాదురదృష్టకరమైన కారణాలతో ఫెయి లయ్యారు. అయితే ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష ఫీజులను వారి వారి పాఠశాలల్లోనే చెల్లించేలా చర్యలుతీసుకుంది. అలాగే తాము సాధిం చిన మార్కులపై సందేహాలు ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 11 వరకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మార్కులే కొలమానం కాదు..
● జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారి మార్కులే కొలమానం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాల్లో ఆశించిన మార్కులు రానంతమాత్రాన, దురదృష్టవశాత్తు ఉత్తీర్ణత సాధించలేనంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
● ఈ రోజు ఉన్నత స్థానాల్లో నిలదొక్కుకున్నవారంతా గతంలో వారి చదువుల్లో ఫెయిలైనవారేనని, జీవితాల్లో జీరో నుంచే మొదలుపెట్టారనే విషయాన్ని మరువరాదని అంటున్నారు.
● మార్కులు, ఫెయిలైనంతమాత్రాన క్షణికావేశాలకు పోవడం, తొందరపాటు నిర్ణయాలకు పోవడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపక్రమించరాదనే విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు.
● ఓటమే గెలుపునకు నాంది అనే విషయాన్ని మర్చిపోవద్దని విద్యావేత్తలు అంటున్నారు.
● ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి సమయంలో కీలకంగా ఉండాలని, లేనిపోని సూటిపోటి మాటలకు పోవద్దని విద్యావేత్తలు చెబుతున్నారు.
తక్కువ మార్కులు వస్తే తెలివి లేనట్టు కాదు
ఉత్తీర్ణత సాధించకపోతే జీవితం ఆగిపోదు
పరీక్షల్లో ఫెయిలైనా జీవితంలో
విజయవంతమైన వారెందరో..
తల్లిదండ్రులూ పిల్లల బాధ్యత మీదేనంటున్న నిపుణులు
విద్యార్థులకు మార్కులే జీవితం కాదు. మేము చదువుకునే రోజుల్లో టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత సాధించడమే గగనం. అలాంటిది ఈరోజు ప్రిన్సిపాల్ స్థాయిలో ఉన్నామంటే క్రమేపీ మమ్మల్ని మేం మార్చుకుని, పోటీ ప్రపంచానికి అనుగుణంగా తయారయ్యాం. అంతే తప్ప.. టెన్త్, ఇంటర్, పోటీ పరీక్షల్లో ఎక్కడా కుంగిపోలేదు. అసలు మార్కులే జీవితం కాదు. చదువుకు మార్కులు కొలమానం కానేకాదు. విద్యార్థులు తమ టాలెంట్‌ను గుర్తించి, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను బట్టి ముందుకు నడుచుకోవాలి. అందులో ఉన్నతస్థాయిలో రాణించేలా ప్రయత్నం మొదలుపెట్టాలి. – డాక్టర్ కె.సూర్యచంద్రరావు,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం


