శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించడంతో పాటు, వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి నుంచి గత ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ స్థానాల వివరాలు, వాటిలో బీసీలకు కేటాయించిన సీట్లు, వాస్తవంగా గెలుపొందిన బీసీ అభ్యర్థుల సంఖ్య తదితర నివేదికలను కోరారు. జిల్లా పరిషత్ సీఈఓ నుంచి జెడ్పీటీసీ స్థానాల వివరాలు, మున్సిపల్ కమిషనర్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో బీసీ అభ్యర్థుల గెలుపు శాతాలను అడిగి తెలుసుకున్నారు. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసేందుకు వీలుగా హౌసింగ్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను కూడా కోరారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల ప్రతినిధులు కమిషన్ చైర్మన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు.


