పోలీసు గ్రీవెన్స్‌కు స్పందన | - | Sakshi
Sakshi News home page

పోలీసు గ్రీవెన్స్‌కు స్పందన

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

శ్రీకాకుళం క్రైమ్‌: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి నిర్వహిస్తున్న ‘డయల్‌ యువర్‌ ఎస్పీ(పోలీసు గ్రీవెన్స్‌)’ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు పోలీసు సిబ్బంది స్పందించారు. తమ ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యలను ఫోన్‌ ద్వారా నేరుగా ఎస్పీకి తెలియజేశారు. సిబ్బంది నుంచి వచ్చిన వినతులను శ్రద్ధగా విన్న ఆయన పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఎటువంటి సమస్యలున్నా 63099 90800 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

సారవకోట వాసికి దాసరి లెజండరీ ఫిల్మ్‌ అవార్డు

సారవకోట: మండలంలోని సారవకోట గ్రామానికి చెందిన జోస్యుల విజయమిత్ర దాసరి నారాయణరావు లెజండరీ ఫిల్మ్‌ అవార్డును శుక్రవారం హైదారాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో అందుకున్నారు. ఈయన గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహించిన 100 డేస్‌ లవ్‌స్టోరీ సినిమాకు గాను నూతన ఉత్తమ దర్శకుడిగా దాసరి లెజండరీ అవార్డును దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో సుమన్‌ చేతులమీదుగా అందజేశారు. దీంతో ఆయనను పలువురు అభినందించారు.

అవలింగికి చెందిన మహిళే దొంగ..?

సారవకోట: మండలంలో వరుసగా జరిగిన మూడు దొంగతనాల్లో అవలింగి గ్రామానికి చెందిన ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. గత నెల 23న అవలింగి గ్రామానికి చెందిన ముద్దాడ గౌరినాయుడు ఇంట్లో 23 తులాల బంగారం, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైంది. అలాగే బైదాలాపురం గ్రామంలో ఈనెల 20న ఆ గ్రామానికి చెందిన యాళ్ల రాము ఇంట్లో రాత్రి పడుకున్న సమయంలో తల్లికూతుళ్ల మెడలో ఉన్న 7 తులాల బంగారం పుస్తెలతాడ్లు తెంచుకుని పోయారు. అవలింగి గ్రామంలో ఈనెల 26న దుంగ లక్ష్మీనారాయణమ్మ రాత్రి ఇంట్లో పడుకున్న సమయంలో మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడు తెంచుకునిపోయారు. ఈ మూడు దొంగతనాలు అవలింగి గ్రామానికి చెందిన మహిళ విశాఖపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 26న దుంగ నారాయణమ్మ మెడలో ఉన్న పుస్తెలతాడు తెంచుకుని వెళ్లిపోయే సమయంలో పుస్తెలతాడులో ఉన్న కాసు, తాడు కోయడానికి వినియోగించిన చాకు కింద పడిపోవడంతో స్థానికులు వాటిని పోలీసులకు అందజేశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ గ్రామానికి చెందిన మహిళగా నిర్ధారించారు. ఆమెకు సాయం చేసిన మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దొంగలించిన సొత్తు వేర్వేరు ఫైనాన్స్‌ కంపెనీల్లో తనఖా పెట్టి బెట్టింగ్‌లు ఆడినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.

వర్షాలతో గుబులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్లు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. వాతావరణం కొంత చల్లబడినా రైతులకు మాత్రం ఇబ్బందిగా మారింది. గాలుల ధాటికి అరటి, మామిడి వంటి పంటలకు నష్టం వాటిల్లింది. రాగులు, జొన్నపంటలు దెబ్బతిన్నాయి.

ఉపాధి వేతనదారు మృతి

ఆమదాలవలస: సరుబుజ్జలి మండలం పాలవలస గ్రామానికి చెందిన లండ జోగమ్మ(48) శుక్రవారం మర్రికర్ర చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా కుప్పకూలి మృతిచెందినట్లు సర్పంచ్‌ మోహన్‌రావు తెలిపారు. మధ్యాహ్నం గాలులు వీస్తున్న సమయంలో చెరువు గట్టు ఎక్కుతుండగా కుప్పకూలిపోవడంతో సహచరులు వెంటనే ఆటోలో ఆమదాలవలస ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జోగమ్మకు భర్త ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement