ట్రిపుల్‌ ఐటీ.. భవితకు గ్యారెంటీ..! | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ.. భవితకు గ్యారెంటీ..!

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

సద్వినియోగం చేసుకోవాలి

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఈనెల 30వ తేదీ వరకు గడువు

ఎచ్చెర్ల: ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాల సందడి మొదలైంది. పదో తరగతి తర్వాత అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎదురుచూసే అవకాశమిది. ఈ సంస్థలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చేరేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు పొందుతున్నారు. ఇక్కడ చేరితే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్ముతున్నారు.

రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్‌ ఐటీలు

రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్‌ ఐటీలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలులో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం విద్యాసంస్థలో సుమారు 1,100 సీట్లు ఉన్నాయి. ఏటా 60 శాతం దాటి బాలికలు సీట్లు సాధిస్తున్నారు. ట్రిపుల్‌ ఐటీలో సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సు ఆరేళ్లు కాగా.. అందులో రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు), నాలుగేళ్ల ఇంజినీరింగ్‌లో చేరుతారు. నూతన విద్యా విధానం–2020 మేరకు పీయూసీ పూర్తి చేసిన విద్యార్థులు రిలీవ్‌ కావచ్చు. ఇంజినీరింగ్‌ సైతం ఏటా రిలీవ్‌ కావచ్చు. విద్యార్హత ఆధారంగా ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇంజినీరింగ్‌లో సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ, సీఎస్‌ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నారు. రిలీవ్‌ అయ్యే విద్యార్థులు ప్లేస్‌మెంట్లు సాధించడంతో పాటు గేట్‌ వంటి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య సైతం అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు.

దరఖాస్తులు స్వీకరణ

2026–27 విద్యా సంవత్సరానికి గానూ రాజీవ్‌గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో ఆరేళ్ల సమీకృత బీటెక్‌ కోర్సులో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రవేశాలను వేగవంతం చేస్తూ అడ్మిషన్లు చైర్మన్‌, యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి సౌజన్యంతో అడ్మిషన్ల కన్వీనర్‌ డా.అమరేంద్రకుమార్‌ చండ్రా ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ప్రవేశాల షెడ్యూల్‌ ఇలా..

దరఖాస్తులను మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించనున్నారు. జూన్‌ 12వ తేదీన ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. గతేడాది జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ.. ఈసారి 15 రోజులు ముందుగానే అంటే జూలై 1 నుంచే పీయూసీ–1 తరగతులను ప్రారంభించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాత విద్యార్థులకు జూన్‌ 29 నుంచే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున, కొత్త విద్యార్థులు కూడా వారితో కలిసి చదువుకొనసాగించేలా ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.

ట్రిపుల్‌ ఐటీలో మంచి భవిష్యత్‌ ఉంటుంది. ఆసక్తి కలిగిన ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిర్ణీత గడువులో ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌, ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిలీవ్‌ నాటికి మంచి ప్లేస్‌మెంట్‌ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ ప్రవేశాలు లభిస్తున్నాయి.

– అమరేంద్రకుమార్‌,

ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌, శ్రీకాకుళం

Advertisement
 
Advertisement
Advertisement