● చిన్నారి వైద్యానికి సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు
రణస్థలం: మండలంలోని జీరుపాలేం గ్రామానికి చెందిన దుమ్ము దుర్గారావు, సుమలత దంపతుల కుమార్తె లోయిస్‌కు అనుకోని ఆపద వచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మూడేళ్ల లోయిస్ బుధవారం ఇంటి డాబాపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. వెంటనే పాప పరిస్థితి విషమంగా మారడంతో శ్రీకాకుళంలోని పలు ఆస్పత్రులకు తిప్పారు. చివరగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప తల లోపల రక్తస్రావమై నరం కట్ కావడంతో ఆపరేషన్ చేయాల్సి ఉందని, సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. తల భాగంలో ఈ చికిత్సకు ఆరోగ్య శ్రీ లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. తండ్రి దుర్గారావుకు చేపల వేటే ఆధారం. ఖాళీ సమయంలో ఆటో డ్రైవర్‌గా వెళ్తుంటాడు. ఆర్థికంగా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న వీరు దాతల సాయం కోరుతున్నారు. దాతలు 96523 66174 నంబర్‌కు ఫోన్‌చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.


