పాతపట్నం: మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, రైతుల కష్టాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీసీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపడ్డారు. మండలంలోని కాగువాడ, కొరసవాడ గ్రామాల్లో రహదారి పక్కన అకాల వర్షానికి తడిచిపోయిన మొక్కజొన్న పంటను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో తడిచిన మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఆమెతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఆర్టీఐ నియోజకవర్గ అధ్యక్షుడు ఏనుగుతల సూర్యం, జిల్లా సహాయ కార్యదర్శి అమర రమణ, మండల కో–ఆప్షన్ సభ్యుడు మాధవ్ పుల్లాయ్, గణపతి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.


