అరసవల్లి: జిల్లాలో మందుల మాఫియా పేట్రేగిపోతుందని, చాలా మందుల షాపులు లైసెన్స్‌లు లేకుండానే నడుస్తున్నాయని, వీటిని వెంటనే మూసివేయించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశా రు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. మందుల మాఫియా జిల్లాలో విస్తృతంగా ప్రభావం చూపుతోందని, డాక్టర్ల చీటీలు లేకుండానే మందులను ఇచ్చేస్తున్నారని, దీంతో ప్రాణాంతక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, డ్రగ్స్ నియంత్రణాధికారులు లంచాల మాటున పనిచేస్తున్నారని, దీంతో ఈ మాఫియా విచ్చలవిడితనం పెరిగిపోతోందనన్నారు. దీన్ని నియంత్రణ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటా యని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నేతలు వై.వేణు, అన్నాజీ, జి.వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం డీఎంహెచ్‌ఓ కె.అనితకు వినతిపత్రాన్ని అందజేశారు.
చెట్టు నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బట్టేరు గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు పెంటబోయిన అప్పారావు (45) తాటిచెట్టుపై నుంచి జారిపడి గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య తవిటమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా : 8 మందికి గాయాలు
పలాస: గొప్పిలి నుంచి పలాసకు వస్తున్న ఆటో అదుపు తప్పి అల్లుకోల చెరువు వద్ద గురువారం బోల్తా పడింది. అతి వేగంతో వస్తున్న ఆటో అదుపు తప్పడంతో చెరువులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవరు సవర జేమ్స్‌తో పాటు మరో 7 మందికి తీవ్రగాయా లయ్యాయి. గాయాలయిన వారిలో ఇప్పిలి సంపత్, వి.ఆర్.ఓ చౌదరి లీలారాణి, ఆలేటి అచ్చమ్మ, దువ్వాడ లక్ష్మీదేవి, కుమ్మర త్రినాథ్, సాన మన్మధరావు, పల్లా రాజేశ్వరిలు ఉన్నారు. ఇందులో ఇప్పిలి సంపత్‌కు కాళ్లు విరిగిపోయాయి. పలాస ప్రభుత్వం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మిగతా వారు కూడా పలాస ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం పలాస కాశీబుగ్గ పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాశీబుగ్గ ఎస్‌ఐ సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్: మండలంలోని కె.కొత్తూరు గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెందిన జలుమూరు గోవిందరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కురుడు గ్రామంలో జరిగిన ఒక పెళ్లికి టెక్కలి నుంచి కారు తీసుకెళ్లారు. పెళ్లి అనంతరం వాహనం తిరిగి ఇచ్చేందుకు కారులో ఇద్దరు వ్యక్తులు టెక్కలి రాగా వారిని తిరిగి తమ గ్రామానికి తీసుకు వెళ్లేందు కు బైక్‌పై పెళ్లి కొడుకు తమ్ముడు గోవిందరావు టెక్కలి వస్తుండగా.. చాకిపల్లి గ్రామం వద్ద కోటబొమ్మాళి నుంచి పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో హుటాహూటిన హైవే సిబ్బంది టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.


