అర్జీదారులు సంతృప్తి చెందాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● 169 అర్జీలు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీదారులు అధికారులు ఇచ్చే సమాధానంపై సంతృప్తి చెందేలా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించి 169 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, పలాస ఎయిర్‌పోర్టు ప్రత్యేక అధికారి ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే..
● రబీ సీజన్‌లోనైనా సకాలంలో ఎరువులు అందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని సువ్వారి గాంధీ వినతిపత్రం అందజేశారు. పీఎంఏవైఅండ్‌జీ పథకాన్ని ఆమదాలవలస నియోజకవర్గానికి వర్తింపజేయాలని కోరారు. పొందూరు మండలంలోని వీఆర్‌గూడెం, లోలుగు గ్రామాల్లో, ఆమదాలవలస మండలంలోని చిట్టివలస గ్రామంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలుపుదల చేయాలన్నారు. ఆమదాలవలస మండలంలోని నిమ్మతిర్లాడ గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసి తాగునీరు అందించాలని కోరారు.
● శ్రీకాకుళం నగరంలో గూనపాలేంలోని చెరువు గట్టులో సుమారుగా 350 కుటుంబాలు గత 40 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని నివసిస్తున్నామని, తమకు శాశ్వత గృహ పట్టాలు, ఇల్లు పథకాలు ఇప్పించాలని అక్కడి ప్రజలు కోరారు.
● ధాన్యం కొనుగోలులో మిల్లర్లు, అక్కడ ఉన్న అధికారులు రైతు నుంచి ప్రతి బస్తాకు సుమారుగా 4 కేజీల వరకు ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని, దీనిని అరికట్టాలని ఏపీ రైతు సంఘం ప్రతినిధులు కోరారు.
లంచం ఇచ్చిన మిల్లర్లకే టార్గెట్లు
జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్‌కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిన మిల్లర్లకే ధాన్యం సేకరణకు ఎక్కువగా టార్గెట్లు ఇస్తున్నారని, మిగిలిన వారికి టార్గెట్లు తగ్గిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని పోలాకి మండలంలో సుసరాం గ్రామంలోని శ్రీదుర్గా మోడ్రన్ రైస్ మిల్లు యజమాని తమ్మినేని భూషణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. 2025 – 26 ఖరీప్ సీజన్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ టార్గెట్లు ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతున్నారని, డీఎం సివిల్ సప్లయ్స్ అధికారి డబ్బులు తీసుకొని టార్గెట్‌లు వేశారని ఆరోపించారు. మిల్లు నుంచి డబ్బులు ఇవ్వలేదని తనకు తక్కువ టార్గెట్ ఇచ్చారన్నారు. తన మిల్లు కెపాసిటీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని 80 శాతం టార్గెట్ ఇవ్వాల్సిండగా, తక్కువ టార్గెట్‌ను ఇచ్చారని వాపోయారు. ఈ అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, తనకు న్యాయం చేయాలని, అర్హత మేరకు టార్గెట్‌ను కేటాయించాలని, అవినీతి లేకుండా చూడాలని కోరారు.


