మృతులకు పరిహారం ఇప్పించండి
కంచిలి: మండలంలోని తలతంపర పంచాయతీ పరిధి చిల్లపుట్టుగ గ్రామంలో మే 26వ తేదీన జరిగిన విద్యుత్ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో వారి కుటుంబాలకు నష్ట పరిహారం ఇప్పించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పి.వి.సూర్యప్రకాశ్‌కు వినతిపత్రం సోమవారం అందజేశారు. దీనికి సూర్యప్రకాష్ స్పందించి నష్ట పరిహారం మంజూరు కు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
యువతి ఆత్మహత్య
రణస్థలం: మండలంలోని కొండములగాం పంచాయతీ ముక్తుంపురం గ్రామానికి చెందిన శీల కీర్తి(16) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని జే.ఆర్.పురం పోలీసులు తెలిపారు. ఈనెల 6వ తేదీన ఇంట్లో టీవీ చూస్తోందని తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన కీర్తి పురుగుల మందు తాగి పడుకొనిపోయింది. రాత్రి సమయంలో వాంతులు చేసుకుంటుండగా తల్లిదండ్రులు గమనించి రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. మృతురాలు కీర్తి రణస్థలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి పైడితల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జే.ఆర్.పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తల్లి రుణం తీర్చుకున్న తనయ
నరసన్నపేట: స్థానిక పురుషోత్తం నగర్‌కు చెందిన మన్నిక రమణమ్మ తన తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. అనారోగ్యంతో బొమ్మాళి రాములమ్మ (65) సోమవారం మృతి చెందారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నప్పటికీ అదృశ్యమై ఏడాది పైనే అవుతోంది. కుమార్తె రమణమ్మ భర్త చనిపోవడంతో తల్లి వద్దే ఉంటుంది. ఈ దశలో తల్లి మరణించడంతో రమణమ్మ తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది.
మృతులకు పరిహారం ఇప్పించండి
మృతులకు పరిహారం ఇప్పించండి


