ప్రసాద్ కథ కంచికే..!
అప్పుడలా..
ఇప్పుడిలా..
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి నగర నలువైపులా విలువైన భూములున్నాయి. సెంటు భూమి రూ.50 లక్షల ధరకు అమ్ముడుపోయే మార్కెట్ ఉంది. ఆలయ పరిసరాలను విస్తరించే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో కూడా పలుచోట్ల ప్రైవేటు స్థలాలను గుర్తించి కొనుగోలు చేసేందుకు అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ప్రైవేటు జిరాయితీ స్థలాలను కొనుగోలు చేయకుండా ప్రత్యామ్నయంగా ఆలయానికి చెందిన విలువైన భూములు ఇచ్చేసేందుకు తాజాగా మంత్రి అచ్చెన్న ఆదేశాలిచ్చేశారు. ఇందులో భాగంగా ఆలయం ముందున్న కొందరి ఇళ్లను ఖాళీ చేయించి వారికి ప్రధాన రోడ్డుపై ఉన్న కమర్షియల్ స్థలాలను అదే విస్తీర్ణం అప్పగించేలా మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం దేవదాయ శాఖాధికారులకు విస్మయానికి గురిచేసింది. 2013 భూసేకరణ చట్టం ద్వారా అవసరమైన స్థలాలను తీసుకుని పరిహారాలను ఇచ్చే మార్గాన్ని ఆలోచిస్తున్న అధికారులకు...తాజాగా మంత్రి ఆదేశాలు మేరకు ఖరీదైన స్థలాలను ఇచ్చేయమనడం చూస్తుంటే..తెరవెనుక ఏం జరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన స్థలాలను ఆలయ అభివృద్ధికి తీసుకోవాలంటే అందుకు తగిన మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలో పరిహారాన్ని చెల్లించే అవకాశముంది. అది కాదని విలువైన స్థలాలన్నీ ఇలా పంచేస్తే..భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆలయానికి మిగిలే భూమి దాదాపుగా తగ్గిపోయే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆదిత్యాలయాన్ని రూ..100 కోట్లతో కనీవినీ ఎరుగని అభివృద్ధి అన్నారు. అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ గత రథసప్తమికి ముందు కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ప్రగల్భాలు పలికారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ను మధ్యలో పెట్టి స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్ల చేతనే ఆలయానికి చెందిన భారీ భవనాలు, దుకాణ సముదాయాలు, వసతి గదులను.. ఇలా ఆదిత్యాలయానికి ఎదురుగా ఉన్న ఏ ఒక్క భవనాన్ని వదలకుండా కూల్చివేయించారు. దీంతో సర్వం కోల్పోయి పదుల సంఖ్యలో వ్యాపారులు రోడ్డునపడ్డారు. కూల్చివేతలకు ఏడాది కావస్తోంది. అయినా.. ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. ఆలయం ముందు మాత్రం విశాలంగా ప్లాట్‌ఫాం వేసేసి ఇంద్రపుష్కరిణి కనిపించేలా ఖాళీగా ఉంచారు. ఈఏడాది జనవరిలో మంత్రి అచ్చెన్న ప్రకటనలకు, తాజాగా గురువారం అరసవల్లిలో చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే..మరి కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని పిలిగ్రమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం కథ కంచికే..అన్నట్లుగా స్పష్టమవుతోంది. ఆ పథకం ఎలాగూ రాదు.. ఆ నెపంతో చేపట్టిన కూల్చివేతల ఘట్టాన్ని మరిపించడానికి అభివృద్ధి పేరిట ఆలయానికి చెందిన (భక్తులచే సమకూరిన ఆదాయం) నిధులు రూ.12 కోట్లను వినియోగించి ఆలయ పరిసరాల్లో కొత్త భవనాలను నిర్మించేలా ప్రతిపాదించారు. దీన్ని వెంటనే ఆమోదించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌కు మంత్రి గురువారం ఫోన్లో ఆదేశించారు. దీంతో ప్రసాద్ స్కీం అటకెక్కినట్లే అన్న స్పష్టత చర్చ జిల్లాలో జోరందుకుంది.
మండిపడుతున్న దాతలు..
అరసవల్లి ఆలయానికి పెద్ద ఆస్తి దాతలే...అలాంటి ఎందరో దాతలు తమ పూర్వీకుల జ్ఞాపకార్ధం..తమ సంస్థల పేరిట రూ.లక్షలతో భక్తుల సౌకర్యార్ధం జింకు రేకు షెడ్లుతో పాటు వసతి గదులను నిర్మించిన సంగతి తెలిసిందే. దశాబ్దాల పూర్వం టీటీడీకి చెందిన వసతి గదుల సముదాయంతో పాటు ఆలయ నిధులతో నిర్మించిన 12 దుకాణాల సముదాయం, ప్రసాదాల కౌంటర్లు, వంటగదులు కూడా కూల్చివేశారు. ఓ దాత ఏకంగా రూ.30 లక్షలతో నిర్మించిన అన్నదాన మండపాన్ని సైతం నేలమట్టం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేయడంపై దాతలు తీవ్రంగా మండిపడ్డారు. సుమారు రూ.7 కోట్ల విలువైన నిర్మాణాలను కూల్చివేసిన కూటమి పెద్దలు..ఇప్పుడు మళ్లీ ఆలయ నిధులు రూ.12 కోట్లతో అభివృద్ధి అంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని స్థానికులు, భక్తులు అంటున్నారు. భక్తులకు ఎండ, వానల నుంచి రక్షణగా భక్తుల విరాళాలతో ఆలయం ముందు భాగంలో నిర్మించిన జింకు షెడ్లును పూర్తిగా కూల్చివేసి.. ఆ స్థానంలో చలవపందిళ్లు వేయాలని మంత్రి చేస్తున్న ప్రకటనపై భక్తులు మండిపడుతున్నారు.
‘‘రాష్ట్రంలో ప్రసిద్ధ సూర్యదేవాలయంగా వెలుగొందుతున్న అరసవల్లి క్షేత్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పిలిగ్రమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం మంజూరు చేయిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. అందుకే కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అంతా దగ్గరుండి కేంద్రం నుంచి ఈ పథకం ద్వారా సుమారు రూ.100 కోట్లు తెప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ పరిసరాలన్నీ అత్యంత సుందరంగా తయారుచేయనున్నాం...’’
– ఈ ఏడాది జనవరిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
‘‘అరసవల్లికి ‘ప్రసాద్’ స్కీం చాలా ఆలస్యమయ్యేలా ఉంది. దేశంలో చాలా మంది ‘ప్రసాద్’ స్కీం అడుగుతున్నారు. ఈ పథకం కోసం తర్వాత చూద్దాం. మన కేంద్రమంత్రి రామ్మోహన్ ఆ పనులు చూసుకుంటున్నారు.. వచ్చే ఏడాది జనవరి 25న రథసప్తమిని ఏడు రోజుల పాటు శ్రీకాకుళం ఉత్సవ్ పేరిట ఘనంగా నిర్వహిద్దాం. ఆలయానికి చెందిన నిధులు రూ.12 కోట్లతో ఇంద్రపుష్కరిణి, అన్నదాన, ప్రసాదాల తయారీ మండపాలు, కేశఖండన శాల, గోశాల తదితర అభివృద్ధి పనులు చేసుకుందాం. ఈమేరకు ప్రతిపాదనలను వెంటనే ఆమోదించేలా చర్యలు చేపడతాం..
– ఈనెల 23న అరసవల్లిలో మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు
ఆదిత్యాలయానికి ప్రసాద్ స్కీం వర్తింపు అనుమానమే..
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలతో భక్తుల నిరాశ
గత రథసప్తమి సందర్భంగా ఇదే స్కీం పేరిట భవనాల కూల్చివేత
ఆలయానికి చెందిన నిర్మాణాలను
కూల్చివేస్తున్న దృశ్యాలు (ఫైల్)
ప్రసాద్ కథ కంచికే..!


