పంచారామాలకు ప్రత్యేక బస్సులు
● అక్టోబర్ 26 నుంచి వచ్చే నెల 16 వరకు క్షేత్రాల దర్శనం
● భక్తులు సద్వినియోగం చేసుకోవాలి: డీపీటీవో
పంచారామాలను దర్శించుకునే భక్తులు ఒక్కొక్కరికి టికెట్ ఖరీదు సూపర్‌లగ్జరీ బస్సుకు రూ.2400, అల్ట్రాడీలక్స్ బస్సుకు రూ.2,350 ప్రయాణచార్జీగా నిర్ణయించారు. ముందస్తు టికెట్ కోసం ఆన్‌లైన్/అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. గ్రూప్‌గా అయ్యప్పభక్తులు వస్తే శబరిమలకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ఆన్‌లైన్ టికెట్‌ల కోసం www.apsrtconline.in సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు 9959225608 నంబర్లను సంప్రదించవచ్చు.
శ్రీకాకుళం అర్బన్: హిందువులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెల రోజులు వ్రతాలు, నోములు ఆచరించడం, దేవాలయాల సందర్శన ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువగా జిల్లాలోని శైవక్షేత్రాలతో పాటు పంచారామాలకు భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఒకటి, రెండో డిపోల నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సోమవారం ఒకే రోజు రాష్ట్రంలోని ఐదు శైవ క్షేత్రాలు అనగా అమరావతిలో అమరేశ్వరస్వామి, భీమవరంలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయాలకు తీసుకెళ్తారు.
కార్తీకమాసంలో ప్రతి ఆదివారం అనగా ఈ నెల 26, నవంబర్ 2, 9, 16వ తేదీలలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆదివారం సాయంత్రం 4గంటలకు బస్సు బయలుదేరుతుంది. సోమవారం ఒకేరోజున ఐదు పుణ్యక్షేత్రాలైన పంచారామాలను దర్శింపజేసి మరలా మంగళవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు చేరుకుంటుంది.
కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పంచారామాల దర్శనం కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 26, అక్టోబరు 2, 9, 16వ తేదీలలో ప్రత్యేక బస్సులు నడపనున్నాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సీహెచ్, అప్పలనారాయణ, డీపీటీఓ
పంచారామాలకు ప్రత్యేక బస్సులు


