పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
శ్రీకాకుళం క్రైమ్ : మోంథా తుఫాన్ నేపథ్యంలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన పరికరాలు, వనరులు సిద్ధంగా ఉంచాలని విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ ఆదేశించారు. రేంజి పరిధిలోని ఎస్పీలతో శనివారం రాత్రి వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంత గ్రామాలను సందర్శించి మత్స్యకారులకు, గ్రామస్థులకు హెచ్చరికలు ఇవ్వాలన్నారు. 24/7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి తగినంత సిబ్బందిని నియమించాలని, ముంపు, లోతట్టు ప్రాంతాల రోడ్లను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. దొంగతనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించరాదని, సోషల్‌మీడియా దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, డిజిటల్ అరెస్టు, ఆర్థిక నేరాలను అరికట్టాలని, సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన బాధితుని సొమ్ము తిరిగి అందేలా చూడాలన్నారు.


