మోక్షమెన్నడో..!
రేషన్‌కార్డులకు..
శ్రీకాకుళం పాతబస్టాండ్:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా కొత్త రేషన్ కార్డుల ఊసెత్తడం లేదు. దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉన్నవారికి అందజేసే ఈ–రైస్‌కార్డును సైతం నిలిపివేసింది. పోనీ ఉన్న కార్డులు స్ప్టిట్టింగ్ చేసుకొనే వెసులుబాటునైనా కల్పించడం లేదు. ఒక చోట నుంచి మరొక చోటుకి రేషన్ కార్డును మార్చుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● గత ప్రభుత్వంలో..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొత్త కార్డుకి దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారం తిరగకుండానే కొత్త కార్డు మంజూరయ్యేది. మరుసటి నెల నుంచే ఆ కార్డులో ఉన్నవారికి ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు అందజేసేవారు. ఈ కార్డు బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులతో పాటు ఆరోగ్య శ్రీ పథకం ప్రయోజనం, పిల్లల చదువులు, రుణాలు, ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్ తదితర సంక్షేమ పథకాలకు ఉపయోగపడేది. దీంతో ఎంతోమంది పేదలు ప్రయోజనం పొందేవారు.
● ఆప్షన్లు నిలిపివేత
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ సప్లయ్ పోర్టల్‌లో ఉన్న ఈ అప్సన్లను నిలుపుదల చేశారు. ఈ పోర్టరు మూసి వేయడంతో కార్డుకు సంబంధించి ఎటువంటి వ్యవహారాలు జరగడం లేదు. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. అలాగే యాడింగ్ కూడా లేకపోవడంతో నూతనంగా వివాహం అయినవారు, పిల్లలు పుట్టినవారు కొత్తగా కార్డులో చేర్చుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. జిల్లాలో కొత్త కార్డులు, స్ప్టిట్టింగ్ కోసం సుమారుగా 45,000 మంది ఎదురు చూస్తున్నారు. అలాగే మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం 23,400 మంది ఉన్నారు. ఒక చోటు నుంచి వేరొక చోటుకి బదిలీ చేసుకునేందుకు 4,500 మంది వేచి ఉన్నారు.
జిల్లాలో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
వెబ్ పోర్టల్‌లో ఆప్షన్లు నిలిపివేత
కొత్త కార్డులు, మార్పులు కోసం అవస్థలు
యాడింగ్ కోసం చూస్తున్నాను
నాకు ఇద్దరు పిల్లలు. వారి ఆధార్ కార్డులు చేయించాను. ప్రస్తుతం నాకు బియ్యం కార్డు ఉంది. దీంతో ఆ కార్డులో నా ఇద్దరి పిల్లలను చేర్పించాలని నాలుగు నెలలుగా ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు సచివాలయం, సివిల్ సప్లయ్ అధికారుల వద్దకు వెళ్లి అడిగాను. కానీ వెబ్ పోర్టల్‌లో ఆప్సన్ లేదని, లాగిన్ పనిచేయడం లేదని వారు చెప్పారు, కూటమి ప్రభుత్వం పేదల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆ లాగిన్‌ను తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నాను. – పేడాడ కాంతారావు, శ్రీకాకుళం
మోక్షమెన్నడో..!


