అనంతపురం ఎడ్యుకేషన్: నిపుణులతో ప్రత్యేకంగా తయారు చేయించిన ‘సాక్షి’ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు అండగా నిలిచింది. బాగా కష్టమని భావించే గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ‘సాక్షి’ యాజమాన్యం తొలిసారి మెటీరియల్ తయారు చేయించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో తాము మంచి మార్కులు సాధించడం వెనుక ఈ మెటీరియల్ దోహదపడినట్లుగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు సగర్వంగా చెబుతున్నారు. ముఖ్యంగా గణితంలో సమస్యలను పరిష్కరించే విధానం, సైన్స్‌లో ముఖ్యమైన ప్రశ్నలపై స్పష్టమైన సమాధానాలివ్వడంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నట్లు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ మెటీరియల్‌ను ప్రశంసిస్తూ, విద్యార్థుల అభ్యాసంలో ఇది కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. సమయానికి సరైన మార్గదర్శకం లభించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ‘సాక్షి’ అందజేసిన ప్రత్యేక మెటీరియల్‌పై పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే.
70 శాతం ప్రశ్నలు అందులోవే
అమ్మ కూలి పని చేస్తుండగా, నాన్న వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నారు. ‘సాక్షి’ అందజేసిన మెటీరియల్‌లోని ప్రశ్నలు 70 శాతం వరకు వచ్చాయి. ఆ మెటీరియల్ చదువుకుని నేను గణితంలో 79, సైన్స్‌లో 96 మార్కులు సాధించాను. మొత్తంగా 523 మార్కులతో రాప్తాడు కేజీబీవీలో టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది.
– ఉమాదేవి గొందిరెడ్డిపల్లి, రాప్తాడు మండలం
చాలా ఉపయోగపడింది
నేను రాప్తాడు కేజీబీవీలో చదువుకున్నా. ‘సాక్షి’ అందజేసిన గణితం, సైన్స్ మెటీరియల్స్‌లో ఇంపార్టెంట్ ప్రశ్నలు చదువుకున్నా. అత్యధికంగా ప్రశ్నలు అందులోనివే వచ్చాయి. దీంతో సైన్స్‌లో 81, గణితంలో 80 మార్కులు వచ్చాయి. మొత్తం 482 మార్కులు సాధించాను. అమ్మానాన్న ఇద్దరూ కూలి పనులకు వెళుతుంటారు.
– సుప్రజ, గొందిరెడ్డిపల్లి, రాప్తాడు మండలం
‘సాక్షి’కి రుణపడ్డాం
చాలామంది పేద విద్యార్థులు మెటీరియల్ కొని చదివే పరిస్థితిలో లేరు. అయితే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా విద్యార్థులందరికీ మెటీరియల్ అందజేసి అండగా నిలిచిన ‘సాక్షి’కి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ‘సాక్షి’ యాజమాన్యం అందజేసిన మెటీరియల్ చదువుకోవడం వల్ల మొత్తం 560 మార్కులు వచ్చాయి.
– ఎస్.మానస, జెడ్పీహెచ్‌ఎస్, ఆత్మకూరు
‘సాక్షి’ మెటీరియల్ చాలా ఉపయోగపడిందంటున్న విద్యార్థులు


