పాము కాటుతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పాము కాటుతో రైతు మృతి

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

గాండ్లపెంట: మండలంలోని పోతవాండ్లపల్లికి చెందిన రైతు పొతా వెంకటరెడ్డి (72) శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు..రోజూ గ్రామ సమీపంలోని జీనులకుంటకు వెంకటరెడ్డి డెయిరీకి పాలు వేసేందుకు వెళ్లేవాడు. శనివారం రాత్రి డెయిరీకి పాలుపోసి పొతవాండ్లపల్లికి వెళ్తుండగా, దారి మధ్యలో పాము కాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంకటరెడ్డి విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య కిష్టమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు

బత్తలపల్లి: మండలంలోని పోట్లమర్రి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. పోట్లమర్రి గ్రామానికి చెందిన సాకే పోతులయ్య, నాగమ్మ దంపతులు ధర్మవరం సమీపంలోని చిన్నూరు వద్ద ఇల్లు నిర్మాణం చేపట్టారు. రోజూ అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఆదివారం కూడా ఇంటి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా, పోట్లమర్రి సమీపంలోని పెట్రోలు బంకులోకి వెళ్తుండగా, ఇదే సమయంలో బత్తలపల్లి వైపు నుంచి ధర్మవరం వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పోతలయ్యకు ఎడమ కాలు విరిగింది. నాగమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు వారిని ఆర్డీటీ ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. క్షతగాత్రుల కుమారుడు సాకే చిన్నప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

గోరంట్ల: వుండల కేంద్రంలోని ఆంజనేయస్వామి కాలనీకి చెందిన బేల్దారి రాజు (47) కడుపు నొప్పి తాళలేక శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బేల్దారి రాజు తాగుడుకు బానిసయ్యాడు. దీనికితోడు తరచూ కడుపునొప్పితో బాధపడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కడుపు నొప్పి తీవ్రమైంది. భార్య ప్రమీలమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి ముంగిట ఆరుబయట నిద్రించారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ రామనాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement