హిందూపురం: పట్టణంలో జరిగిన దోపిడీ కేసు ఛేదించి..ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి సొమ్ముతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. ఆదివారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటో కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు రాజేశ్వరమ్మను బెదిరించి 83 గ్రాముల బంగారు నగలు రూ.50 వేలు నగదు లాక్కెళ్లిన ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి, నిందితులను గుర్తించారు.
ఘటన జరిగిన పది గంటల్లోపే చాకచక్యంగా కేసు ఛేదించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న రాజేశ్వరమ్మ వద్ద నగలు, నగదు ఉన్నట్లు గుర్తించి పతకం ప్రకారం బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ భార్య, 13 ఏళ్ల బాలుడు పెనుకొండకు వెళ్తున్నట్లు చెప్పి డీజిల్ ఆటోలో ఎక్కారు. పక్కనే వేచి ఉన్న రాజేశ్వరమ్మను కూడా ఆటోలో ఎక్కించుకున్నారు. ఆటో.. కొంతదూరం వెళ్లిన తర్వాత కత్తితో బెదిరించి, ఆమె వద్దనున్న బంగారు నగలు, నగదు లాక్కొని, కొట్నూరు బైలు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఆమెను వదిలివేసి, అక్కడి నుంచి ఉడాయించారు. బాధితురాలు ఫోన్‌లో సమాచారం అందించడంతో జిల్లా ఎస్‌పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపి, హిందూపురం, పెనుకొండ పోలీసుల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసును గంటల వ్యవధిలో ఛేదించారు.నిందితులను సూపర్‌బీ స్నిన్నింగ్ మిల్లు వద్ద అదుపులోకి తీసుకొని,వారి నుంచి బంగారు నగలు, నగదు, నేరానికి ఉపయోగించిన కత్తి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐలు జనార్ధన్, ఆంజనేయులు, అబ్దుల్ కరీం, ఎస్‌ఐ రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బంగారు, నగదుతోపాటు ఆటో, కత్తి స్వాఽధీనం


