 
															వ్యక్తి బలవన్మరణం
కదిరి అర్బన్: మండలంలోని బాలప్పగారిపల్లికి చెందిన బాలూనాయక్ (38) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో ప్రమాదవశాత్తు కాలు విరగడంతో చికిత్స పొందాడు. అప్పటి నుంచి తరచూ అనారోగ్య సమస్యలు వెన్నాడుతుండడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కదిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వేధింపులపై కేసు నమోదు
ధర్మవరం అర్బన్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్త, మామపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. వివరాలను గురువారం వెల్లడించారు. ధర్మవరంలోని మారుతీనగర్‌కు చెందిన సాకే వెంకటేష్‌కు ఇదే మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన సాకే కమలమ్మతో 2017లో వివాహమైంది. వెంకటేష్ డ్రైవర్‌గా వెళుతుండగా, కమలమ్మ కూలి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైళ్లెన ఏడాది అనంతరం కమలమ్మతో వెంకటేష్ గొడవ పడుతూ తాగుడుకు బానిసయ్యాడు. అనుమానంతో భార్యను వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే అప్పులున్నాయని, వాటిని తీర్చేందుకు పుట్టింటి నుంచి రూ. 2 లక్షలు తీసుకురావాలంటూ భర్తతో పాటు అత్తమామలు మానసికంగా, శారీరకంగా వేధించేవారు. అంశంపై పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీ చేసినా వారిలో మార్పు రాలేదు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో ఈ ఏడాది మార్చిలో కమలమ్మ తన పుట్టింటికి చేరుకుంది. అయినా వేధింపులు మానలేదు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాగుడుకు డబ్బివ్వలేదని
వ్యక్తి ఆత్మహత్య
ఓడీచెరువు(అమడగూరు): తాగుడుకు కుటుంబసభ్యులు డబ్బివ్వకపోవడంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అమడగూరు మండలం కొత్తపేటకు చెందిన పసుపులేటి వెంకటనారాయణ(54)కు భార్య అమరావతి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల మద్యానికి బానిసైన వెంకటనారాయణ.. తరచూ తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ కుటుంబసభ్యులను వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం కొడుకు మల్లికార్జునను డబ్బు అడగడంతో తన వద్ద లేవని తెలిపాడు. దీంతో క్షణికావేశానికి లోనైన వెంకటనారాయణ పొలం వద్దకెళ్లి పురుగుల మందు తాగాడు. అటుగా వెళుతున్న వారి నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని అపస్మారక స్థితికి చేరుకున్న వెంకటనారాయణను కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక మృతి చెందాడు. ఘటనపై ఎస్‌ఐ సుమతి కేసు నమోదు చేశారు.
రైల్వే ఉద్యోగి దుర్మరణం
సోమందేపల్లి: మండలంలోని పందిపర్తి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి రైల్వే ఉద్యోగి వెంకట్రామిరెడ్డి (45) మృతి చెందాడు. పందిపర్తికి చెందిన ఆయన గురువారం రాత్రి హిందూపురం నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోకి చేరుకోగానే రోడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహన
దొంగల అరెస్ట్
హిందూపురం: కర్ణాటక సరిహద్దులో ద్విచక్ర వాహనాలు అపహరించే ముగ్గురిని అరెస్టు చేసి, 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు హిందూపురం డీఎస్పీ మహేష్ తెలిపారు. గురువారం హిందూపురం అప్‌గ్రేడ్ రూరల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. గురువారం సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మోక్షిత్ అనే యువకుడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో ఉమర్ ఫారూక్, జమీర్ వ్యక్తులతో కలసి ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నట్లుగా వెల్లడించాడు. మోక్షిత్ సమాచారంతో మిగిలిన ఇద్దరినీ కూడా అరెస్టు చేసి, దాచి ఉంచిన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
 
							వ్యక్తి బలవన్మరణం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
