 
															విద్యతోనే ఉజ్వల భవిత : డీఈఓ
పుట్టపర్తి టౌన్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరూ బాగా చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని విద్యార్థులకు డీఈఓ కిష్టప్ప సూచించారు. గురువారం కొత్తచెరువు మండలం చెన్నరాజుపల్లి, బండ్లపల్లి గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులతో ఆరా తీశారు. పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం ఆరగించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జయచంద్ర, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రైతుపై ఎలుగుబంటి దాడి
పావగడ: తాలూకాలోని కరియమ్మన పాళ్య గ్రామానికి చెందిన రైతు ఈరణ్ణపై ఎలుగు బంటి దాడి చేసింది. గురువారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో పొదల్లో నుంచి ఒక్కసారిగా ఎలుగుబండి దాడి చేసింది. రైతు తీవ్రంగా ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు వెంటనే అక్కడకు భారీగా శబ్ధాలు చేయడంతో ఎలుగుబంటి పారిపోయింది. తల, భుజంపై లోతైన గాయాలైన ఈరణ్ణను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తుమకూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ప్రభుత్వాసుపత్రిలో
మహిళ అదృశ్యం
అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అడ్మిషన్‌లో ఉన్న చిన్నారిని తీసుకుని ఓ తల్లి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన మీనుగ కేశమ్మ కనిపించలేదని భర్త ఓబులప్ప ఫిర్యాదు చేశారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడో సంతానమైన చిన్నారి శ్రుతికి ఆరోగ్యం బాగలేకపోతే నాలుగు రోజుల క్రితం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. భర్త ఓబుళప్ప బేల్దారి పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇద్దరు పిల్లలను ప్రభుత్వాస్పత్రిలోనే వదిలేసి చిన్న కూతురితో కలిసి తల్లి వెళ్లిపోయింది. ఓబులప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్ తెలిపారు.
 
							విద్యతోనే ఉజ్వల భవిత : డీఈఓ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
