మల్బరీతో కాదు ఆముదంతో... | - | Sakshi
Sakshi News home page

మల్బరీతో కాదు ఆముదంతో...

Oct 31 2025 9:25 AM | Updated on Oct 31 2025 9:25 AM

మల్బరీతో కాదు ఆముదంతో...

మల్బరీతో కాదు ఆముదంతో...

అనంతపురం అగ్రికల్చర్‌: పట్టుగూళ్ల పెంపకంలో సరికొత్త ప్రయోగానికి పట్టు పరిశ్రమశాఖ సన్నాహాకాలు చేస్తోంది. ఇప్పటి వరకూ మల్బరీ ఆకుల ద్వారా పట్టుగూళ్లు పండిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై ఆముదం (క్యాస్టర్‌) ఆకులు మేతగా వేసి పట్టుగూళ్లు పండించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ తరహా పట్టుగూళ్ల పెంపకాన్ని ‘ఎరి సెరికల్చర్‌’గా పిలుస్తారని... ఈశాన్య రాష్ట్రాల్లో కొందరు రైతులు పండిస్తున్నట్లు పట్టుశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఇటీవల ఆముదం పంట సాగు విస్తీర్ణం బాగా పెరగడంతో... ఇక్కడ కూడా అలాంటి పంటను ప్రయోగాత్మకంగా చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పట్టుశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆముదం పంట సాగు ప్రాంతాలు, విస్తీర్ణం, రైతుల స్థితిగతులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. కొందరు రైతులను ఎంపిక చేసి వచ్చే ఖరీఫ్‌ నుంచి ప్రయోగాత్మకంగా ఆముదం ద్వారా పట్టుగూళ్లు పండించేందుకు సిద్ధమవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఆముదం

గత ఐదారేళ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వేరుశనగ సాగు తగ్గించి చాలా మంది రైతులు కంది, మొక్కజొన్నతో పాటు ఆముదంపై దృష్టి సారించారు. ఐదారేళ్ల క్రితం వరకు వందల ఎకరాలకు పరిమితమైన ఆముదం ఇప్పుడు వేలాది ఎకరాలకు చేరుకుంది. ఈ ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో 45 వేల ఎకరాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 13 వేల ఎకరాలు... మొత్తంగా 58 వేల ఎకరాల్లో ఆముదం సాగులోకి వచ్చింది.

కొద్ది పాటు మార్పుతో..

మామూలు మల్బరీ పద్ధతితో పోల్చుకుంటే కొద్ది పాటు మార్పుతో ఆముదంతో పట్టుగూళ్లను పెంచే అవకాశముంది. మల్బరీ ద్వారా నెల రోజులకే పంట చేతికొస్తుండగా ఆముదం ద్వారా అయితే రెండు నెలలు సమయం పడుతుంది. ఇపుడున్న పద్ధతిలో అయితే పట్టు పురుగుల్లో రోగనిరోధక శక్తి తక్కువ కాగా, ఆముదం పంట కింద మేపుతున్న పురుగుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటోంది. ఇపుడున్న పట్టుగూళ్ల నుంచి రెక్కల పురుగులు ఆలస్యంగా బయటకు రావడం వల్ల దారం పొడవుగా ఉంటుంది. ఆముదం ద్వారా అయితే పట్టుగూళ్ల నుంచి రెక్కల పురుగు వెంటనే బయటకు రావడం వల్ల దారం పొట్టిగా తక్కువగానే వస్తుందని చెబుతున్నారు. ఆముదం పట్టుగూళ్ల నుంచి ‘అహింసా’ అలాగే ‘పీస్‌ సిల్క్‌’ పేరుతో పట్టుచీరలు, ఇతరత్రా వస్తువుల తయారీకి వాడుతుండటం, వాటికి మార్కెట్‌లో గిరాకీ ఉన్నందున పట్టుగూళ్లకు కూడా మంచి ధరలు పలికే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆముదం పంట ఉత్పత్తులతో పాటు అదనంగా పట్టుగూళ్ల పెంపకం ద్వారా రైతుకు లాభం ఉంటుందని చెబుతున్నారు. మరి ప్రయోగాత్మక సాగులో ‘ఎరి సెరికల్చర్‌’ విధానం ఎంత వరకు ఫలితం ఇస్తుందనేది వేచిచూడాలి.

పట్టుగూళ్ల పెంపకంలో

సరికొత్త ప్రయోగంపై దృష్టి

ఆముదం విస్తీర్ణంపై

వివరాలు సేకరిస్తున్న పట్టుశాఖ

వచ్చే ఖరీఫ్‌ నుంచి ప్రయోగాత్మకంగా ‘ఎరి సిల్క్‌వార్మ్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement