పంచాయతీలపై ‘కూటమి’ భారం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీలపై ‘కూటమి’ భారం

Oct 31 2025 9:25 AM | Updated on Oct 31 2025 9:25 AM

పంచాయతీలపై ‘కూటమి’ భారం

పంచాయతీలపై ‘కూటమి’ భారం

తాడిపత్రి రూరల్‌: ఉమ్మడి జిల్లాలో పంచాయతీలపై కూటమి సర్కార్‌ మరో భారం వేసింది. 2017–18లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో విద్యుత్తు దీపాల నిర్వహణను ప్రైవేటు ఈఈఎస్‌ఎల్‌ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌)కు అప్పగించింది. ఆదా అయ్యే విద్యుత్‌ బిల్లుల్లో 80 శాతాన్ని కాంట్రాక్టర్లకు పంచాయతీలు చెల్లించాలని నిబంధనను విధించింది. దీంతో ఒక్కొక్క లైట్‌ నిర్వహణకు మూడు నెలలకు ఒకసారి రూ.150 చొప్పున ఏడాదికి రూ.600 ప్రకారం పదేళ్ల పాటు రూ.6వేల వరకు కాంట్రాక్టర్‌కు పంచాయతీలు చెల్లించాల్సి వచ్చింది. అయితే ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు అప్పట్లో ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు ప్రభుత్వం నిధులు చెల్లించలేదు. రూ.కోట్ల బకాయిలను ప్రస్తుతం పంచాయతీలే చెల్లించాలంటూ ఒత్తిళ్లు పెంచింది. ఉమ్మడి జిల్లాలోని 64 మండలాల్లోని పంచాయతీల పరిధిలో రూ. 5 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.6 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బకాయిలను చెల్లించాలని సంస్థ నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. దీంతో ఈఈఎస్‌ఎల్‌ బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకున్న ఎంపీడీఓలు.. ఈ ఏడాది అగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో జనరల్‌ ఫండ్‌తో పాటు ప్రభుత్వం నుంచి అరకొరగా వచ్చిన నిధుల్లో రూ.5 లక్షల వరకు చెల్లించారు. మిగిలిన బకాయిలు సైతం వెంటనే చెల్లించాలంటూ తాజాగా ఎంపీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఎలాంటి ఆదాయ వనరులు లేని పంచాయతీలపై ఇది అదనపు భారం కానుండడంతో పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జగనన్న పల్లె వెలుగుతో విద్యుత్‌ వినియోగం నియంత్రణ

2018లో వీధి స్తంభాలకు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లకు స్విచ్‌బాక్స్‌లు ఏర్పాటు చేయకపోవడంతో నిరంతరం వెలిగేవి. దీంతో విద్యుత్‌ వినియోగం ఎక్కువై బకాయిలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగనన్న పల్లె వెలుగు కార్యక్రమంలో భాగంగా నిరంతరం వెలుగుతున్న ఎల్‌ఈడీ లైట్లకు స్విచ్‌ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్‌ వినియోగం తగ్గింది. అంతేకాకుండా నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్ల చేతి నుంచి తప్పించి పంచాయతీలకు గత జగన్‌ సర్కార్‌ అప్పగించింది. దీంతో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన అదనపు సొమ్ము సైతం ఆదా అయింది. తాజాగా కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిళ్లు పెంచడంతో సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులు అందజేయడం లేదని, ఉన్న స్థానిక వనరులతోనే ఇంత కాలం సర్దుకు పోతున్నామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిళ్లు పెంచడం భావ్యం కాదని పేర్కొంటున్నారు.

ఈఈఎస్‌ఎల్‌ బకాయిలు

చెల్లించాలంటూ ఒత్తిడి

ఉమ్మడి జిల్లాల్లో పేరుకుపోయిన

రూ.6 కోట్లకు పైగా బకాయి

ఇప్పటికే నిధుల లేమితో

అల్లాడుతున్న పంచాయతీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement