
హిందీ టీచర్‌ను నియమించండి
హిందూపురం: తమకు హిందీ టీచర్‌ను నియమించాలని హిందూపురం మండలం తూముకుంట గ్రామ పాఠశాల విద్యార్థులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తూముకుంటలోని పారిశ్రామిక వాడలో బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరి పిల్లలు 50 మంది స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే భాష తెలియని కారణంగా మరో వంద పిల్లలు పాఠశాలకు దూరమయ్యారు. విషయాన్ని పలుమార్లు అధికారులకు విన్నవించినా హిందీ టీచర్‌ను నియమించకపోవడంతో చివరకు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి నాలుగు నెలల క్రితమే ఆర్‌జేడీతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అయినా ఇప్పటి వరకూ హిందీ టీచర్‌ను నియమించకపోవడంతో వలస కార్మికుల పిల్లలు బడికి దూరమవుతున్నారు. దీంతో హిందీ టీచర్‌ను ఏర్పాటు చేసి, తమ పిల్లలు భవిష్యత్తును కాపాడాలని వలస కార్మికులు కోరుతున్నారు.
బాలికలకు రక్షణ కరవు..
ప్రస్తుతం తూముకుంట పాఠశాలకు ప్రహరీ లేదు. ఈ పాఠశాలలోని రెండే గదుల్లో 1 నుంచి 5వ తరగతి వరకు వంద మంది విద్యార్థులు ఉన్నారు. ప్రహరీ లేకపోవడంతో తరచూ తాగుబోతులు పాఠశాలలో చేరి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రెండు నెలల క్రితం ఓ బాలికపై అఘాయిత్యం కూడా జరిగింది. అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.