
అంతా మా ఇష్టం
అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ, కౌన్సెలింగ్ గందరగోళంగా తయారైంది. పారదర్శకత కరువైంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ సాగిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పలుకుబడి, డబ్బు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత, సీనియార్టీ పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు అసిస్టెంట్లు మండిపడుతున్నారు.
ప్రణాళికేదీ...?
కలెక్టర్ అనుమతితో ఈనెల 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో శనివారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ)కు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. రెండు జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, సూపరింటెండెంట్ల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పద్ధతి, ప్రణాళిక లేకుండా చేపట్టడంతో ఏం జరుగుతుందనే వీఏఏలు ఆందోళనతో ఎగబడ్డారు. ర్యాంకులు, మెరిట్ ప్రకారం వీఏఏలు పట్టుబట్టగా, అధికారులు మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారం కొనసాగిస్తామని చెప్పారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ గంట పాటు నిలిపేశారు. చివరకు ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌కు అధికారులు అంగీకరించారు.
సోమవారం ఉత్తర్వులు..
ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం పోస్టులు 282 ఉండగా... అందులో పనిచేస్తున్న వారు 248 మంది ఉన్నారు. అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వీఏఏలు 229 మంది బదిలీకి అర్హత ఉన్నట్లు తెలిపారు. మరో 19 మంది రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. అటు ఉద్యానశాఖ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 323 మంది వీహెచ్‌ఏలు ఉండగా అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 280 మందికి బదిలీలు చేపట్టారు. మరికొందరు రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. శనివారం రెండు జిల్లాల నుంచి తరలివచ్చిన వీహెచ్‌ఏలు ఆప్షన్లు ఇచ్చేశారు. సోమవారం సాయంత్రానికి బదిలీ ఉత్తర్వులు ఇస్తామని అధికారులు తెలిపారు. ఖాళీల వివరాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆప్షన్లు ఇవ్వడానికి వీహెచ్‌ఏలు కూడా ఇబ్బంది పడ్డారు. పట్టుపరిశ్రమశాఖ అసిస్టెంట్ల బదిలీలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియలో పారదర్శకత కరువు
నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ
సర్వత్రా విమర్శలు

అంతా మా ఇష్టం