
మంత్రి సవిత వల్లే ‘ప్రీకాట్’ మూత
పరిగి: నాలుగు దశాబ్దాలకుపైగా వేలాది మంది కార్మికులు, కూలీలకు ఉపాధి కల్పించిన కొడిగెనహళ్లి ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లు మూత పడటానికి మంత్రి సవిత వైఖరే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆరోపించారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీల రాయితీ ఇవ్వకపోవడంతో మిల్లు పడింది. ప్రభుత్వ వైఖరిని, మంత్రి సవిత నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ శనివారం ఉషశ్రీచరణ్ ప్రీకాట్ మిల్లు గేటు వద్ద కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లతో పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ, నూతన పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పిన కూటమి పార్టీల నేతలు ఇప్పుడు ఉన్న కంపెనీలను మూసివేస్తూ ఉపాధిని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా సవిత బాధ్యతలను స్వీకరించిన తరువాత నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ స్థాపనకు కృషి చేయాలేదన్నారు.
వేలాది కుటుంబాలను పోషించిన మిల్లు
నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లు వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ అండగా నిలిచిందని ఉషశ్రీచరణ్ తెలిపారు. అలాంటి మిల్లుకు కూటమి ప్రభుత్వం విద్యుత్ రాయితీ ఇవ్వకపోవడంతో యాజమాన్యం మూసివేసిందన్నారు. దీంతో మిల్లు కార్మికుల కుటుంబాలు నేడు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇందుకు కూటమి సర్కార్ వైఖరితో పాటు మంత్రి సవిత చేతకాని తనమే కారణమన్నారు. ఇప్పటికై నా మంత్రి సవిత ప్రత్యేక చొరవ చూపి ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లును తెరిపించేందుకు అన్ని విధాలా కృషి చేయాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. లేదంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల, కర్షకుల ఉసురు ఊరికేపోదని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున మిల్లు కార్మికులు పాల్గొన్నారు.
కార్మికుల ఉసురు కూటమి
పెద్దలకు తగులుతుంది
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
మిల్లు గేటు ఎదుట కార్మికులు,
పార్టీ నేతలతో కలిసి ఆందోళన