విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో ఆస్తినష్టం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో ఆస్తినష్టం

May 4 2025 6:13 AM | Updated on May 4 2025 6:13 AM

విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో ఆస్తినష్టం

విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో ఆస్తినష్టం

హిందూపురం: మోతుకపల్లిలో విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆస్తినష్టం వాటిల్లింది. బాధితుడి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పూల నాగరాజు శనివారం విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో ఫ్రిడ్జిలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే ఇంటిలోని వస్తువులు, బీరువా, అందులోని మూడున్నర తులాల బంగారు నగలు కాలిపోయాయి. ఘటనలో దాదాపు రూ.5 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. పూలు అమ్ముకుని జీవించే తాము అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామని ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు.

నలుగురిపై కట్నం

వేధింపుల కేసు నమోదు

బత్తలపల్లి: అదనపు కట్నం కోసం వేధిస్తున్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాలు.. గుమ్మల్లకుంట గ్రామానికి చెందిన శ్రావణిని 2019లో గద్వాల్‌ జిల్లా కోయిలదిన్నె గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డికు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. అప్పట్లో కట్నం కింద 35 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 లక్షలు నగదు ఇచ్చారు. అదనపు కట్నం కోసం నాలుగేళ్ల నుంచి శ్రావణిని భర్త, అతని తల్లిదండ్రులు నిర్మలమ్మ, కేశవరెడ్డి, బావ విజయ్‌కుమార్‌రెడ్డి మూకుమ్మడిగా తీవ్ర వేధింపులకు గురి చేశారు. దీంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కౌన్సిలర్‌ ద్వారా పిల్లల భవిష్యత్‌ కోసం కలిసి జీవించాలని సర్ది చెప్పారు. అయినా భర్త, అత్త, మామ, బావ ప్రవర్తన మార్చుకోకుండా వేధింపులు కొనసాగించారు. దీంతో మరోసారి రూ.2 లక్షలు తీసుకెళ్లి భర్తకు ఇచ్చింది. అయితే శ్రావణి తల్లి పేరు మీద ఉన్న భూమిని ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఇవ్వాలని ఏడాది నుంచి వేధింపులు కొనసాగిస్తున్నారు. పిల్లలను పట్టించుకోకుండా కట్నం కోసం వేధిస్తుండటంతో శుక్రవారం బత్తలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నల్ల్లలమ్మ ఆలయంలో చోరీ

రాప్తాడు: బుక్కచెర్ల ఎస్సీ కాలనీలోని నల్ల్లలమ్మ ఆలయంలో అమ్మవారి సోత్తులు చోరీకి గురయ్యాయి. ఆలయ నిర్వాహకులు, గ్రామపెద్దలు తెలిపిన వివరాలు.. ఆలయ పూజారి నల్లప్ప అమ్మవారికి ప్రతి మంగళ, శుక్ర, ఆదివారం పూజలు చేస్తుండేవారు. శుక్రవారం పూజలు చేసి ఆలయానికి తలుపులు వేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించి 80 గ్రాముల అమ్మవారి ముఖావళి, 20 గ్రాముల 3 వెండి గొడుగులు, ఒక తులం బంగారు తాళిబొట్టును ఎత్తుకెళ్లారు. రూ.2 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు.

మద్యం మత్తులో

స్నేహితుడిపై దాడి

అనంతపురం: మద్యం మత్తులో స్నేహితుడిపై దాడిపై దాడి చేసిన ఘటన శారదనగర్‌లో చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ వి. రాజేంద్రనాథ్‌ యాదవ్‌ తెలిపిన వివరాలు..ఫెర్రర్‌ నగర్‌కు చెందిన మునాఫ్‌, శారదానగర్‌కు చెందిన మురళి మిత్రులు. మద్యం సేవించిన అనంతరం మాటామాట పెరిగింది. వ్యక్తిగతంగా దూషించుకున్నారు. స్థానికులు సర్దిచెప్పి పంపించేశారు. దూషించాడనే అవమానంతో దూషించిన మురళి నాటు కొడవలి, దుస్తులు శుభ్రం చేసే సోడా రసాయన ద్రావణం, తీసుకుని తిరిగి మద్యం షాపు వద్దకు వచ్చాడు. శారదనగర్‌లో మద్యం షాపు వద్ద మద్యం సేవిస్తున్న మునాఫ్‌పై ద్రావణం చల్లాడు. రాయి, కొడవలితో దాడికి యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడ్డ మునాఫ్‌ను ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. బాధితుడి కళ్లు, ముఖం, శరీర భాగాలు దెబ్బన్నాయని, మెరుగైన చికిత్స అవసరమని డాక్టర్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు మురళిని అదుపులోకి తీసుకున్నారు.

రెచ్చిపోయిన జేసీ

సీపీఎం నేత రాంభూపాల్‌పై

అనుచిత వ్యాఖ్యలు

తాడిపత్రిటౌన్‌ : తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. సీపీఎం రాష్ట్ర నేత రాంభూపాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాన్ని చెప్పడమే నేరమన్నట్లుగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉన్నా జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు. ఈ అంశంపై ‘సాక్షి’ టీవీ డిబేట్‌లో రాంభూపాల్‌ మాట్లాడడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. శనివారం తాడిపత్రిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ..తనదైన రీతిలో రెచ్చిపోయారు. ‘స్కూల్‌ గ్రౌండ్‌లో టిప్పర్లతో రాళ్లు వేశామని మాట్లాడుతున్నావ్‌.. మాజీ ఎమ్మెల్యేను ఎందుకు వెనుకేసుకొస్తున్నావ్‌? ఏమైనా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నావా? గత ఐదేళ్లు ఎక్కడికి పోయింటివి రాంభూపాల్‌.. ఆరోజు నన్ను పోలీసోళ్లు ముసలోడినని కూడా చూడకుండా ఎలా తోశారో చూడలేదా? నాకు నీ మీద మంచి అభిప్రాయం ఉండేది. ఈ రోజుతో నీకు మర్యాద పోయింది. నీ గురించి కూడా తీస్తా. విత్‌ రికార్డ్‌తో వస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement