
టీడీపీ కార్యకర్త దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం నరసనాయనికుంట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బి.ముత్యాలప్పపై ఆయన బంధువు, టీడీపీ కార్యకర్త తిరుపాలు కట్టెతో దాడి చేయడంతో కాలు విరిగింది. బాధితుడు సర్వజన ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. ఈనెల 13న జరిగిన దాడి ఘటనకు సంబంధించి బాధితుడు ముత్యాలప్ప, ఆయన కుటుంబ సభ్యుల వివరాల మేరకు... ముత్యాలప్పకు ఇద్దరు సోదరులున్నారు. వీరి ముగ్గురికి కలిపి 12 ఎకరాల భూమి ఉంది. ఎవరికి వారు భాగపరిష్కారాలు చేసుకున్నారు. పెద్దవాడు అయిన ముత్యాలప్ప తన భాగానికి వచ్చిన ఆస్తిని విక్రయానికి పెట్టాడు. ఇటీవల ముత్యాలప్ప సోదరుడి అల్లుడు, టీడీపీ కార్యకర్త తిరుపాలు కలగజేసుకుని మధ్యవర్తిగా ఉంటూ కొనుగోలుదారుడిని పిలిపించాడు. ముత్యాలప్ప చెప్పిన ధరకంటే చాలా తక్కువకు అడగడంతో అమ్మేందుకు ముత్యాలప్ప, ఆయన కుమారులు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి తిరుపాలు కోపంతో రగలిపోతున్నాడు. ఈనెల 13న రాత్రి 7 గంటల సమయంలో ముత్యాలప్ప కుమారుడు, ఆయన తమ్ముడి కుమారుడు కలిసి భూమి అమ్మకం విషయమై మాట్లాడుకుంటుండగా... అక్కడికి వచ్చిన తిరుపాలు కట్టెతో దాడి చేశాడు. ఈ దాడిలో ముత్యాలప్ప కుడి కాలు విరిగి తీవ్రగాయమైంది. 108 సకాలంలో రాకపోవడంతో అందుబాటులో ఉన్న ఆటోను పిలవగా... వెళ్లకూడదంటూ ఆటో డ్రైవర్‌ను తిరుపాలు బెదిరించాడు. అప్పటికే సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆటోలో పంపేలా చర్యలు తీసుకున్నారు. సర్వజన ఆస్పత్రిలో ముత్యాలప్ప చికిత్స పొందుతున్నాడు. దాడి ఘటనపై రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.