ఇదే వివాదానికి కారణం.. | - | Sakshi
Sakshi News home page

ఇదే వివాదానికి కారణం..

May 14 2026 1:07 AM | Updated on May 14 2026 1:07 AM

జిల్లాలో కూటమి పార్టీల మధ్య రాజకీయ వైరం కుంపటి రగులుతోంది. టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. భాగస్వామ్య పార్టీలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్న వైఖరితో ఆ పార్టీల మధ్య కురుక్షేత్ర యుద్ధం తలపించే రీతిలో పరిస్థితులు మారాయి. టీడీపీకి అధికారం కట్టబెట్టే క్రమంలో అహర్నిశలు పాటుపడిన బీజేపీ ఉనికిని లేకుండా చేసేందుకు మంత్రి నారాయణ అనుసరిస్తున్న వ్యవహార శైలి రణరంగంగా మారింది. కమలం అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌ అంటూ బీజేపీ జిల్లా అగ్రనేతలు ఆగ్రహంతో రగిలిపోయారు. మంత్రికి తమ పవర్‌ చూపిస్తామంటూ బీజేపీ సీనియర్‌ నేత సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ఇచ్చిన మాస్‌ వార్నింగ్‌ జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జాతీయ స్థాయిలో కమలం వికసిస్తున్నా.. ఏపీలో అందులో జిల్లాలో ఉనికిని చాటుకోలేకపోతోంది. బీజేపీ భాగస్వామ్యంతోనే అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ విషయాన్ని విస్మరించి ఇప్పుడు ఆ పార్టీనే కూకటి వేళ్లతో పెకళించేందుకు మంత్రి నారాయణ వ్యవహరిస్తున్న తీరు ఆ రెండు పార్టీ ల మధ్య వైరాన్ని పెంచింది. తాజాగా నెల్లూరు నగరంలో బీజేపీ కార్యాలయం తొలగింపు పెద్ద వివాదం రేపింది. మంత్రి నారాయణ ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గంలోనే కమలనాథులకు ఊహించని షాక్‌ ఎదురవ్వడమే కాకుండా ఘోర అవమానం చోటు చేసుకుంది. దాదాపు రెండేళ్లు సంయమనంతో వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు బస్తీమే సవాల్‌ అంటూ మాస్‌ వార్నింగ్‌ ఇస్తూ తొడగొట్టారు. ఎన్నడూ లేని విధంగా కమలనాథులు ఈ దఫా చూపించిన తెగువ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

తొలగించిన చోటే కార్యాలయ నిర్మాణం

ఎక్కడైతే బీజేపీ కార్యాలయాన్ని తొలగించారో అదే స్థలంలో బుధవారం పార్టీ శ్రేణులు ఆ పార్టీ జిల్లా అగ్రనేతల సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి సమక్షంలోనే తిరిగి కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎన్‌ఎంసీ అధికారులు నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి నిలుపదల చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ వందలాది మంది పార్టీ శ్రేణులు ఉండడం..వారంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇక చేసే ది ఏమీలేక ఎన్‌ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగాధికారులు వెనుతిరగాల్సి వచ్చింది. మంత్రి నారాయణను ఏకంగా బండబూతులే తిట్టారు. మంత్రి అండతో కార్పొరేషన్‌ కమిషనర్‌ రెచ్చిపోతున్నాడంటూ ఆగ్రహంతో ఊగిపోవడమే కాకుండా సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేయడం, మంత్రి నారాయణకే సవాల్‌ విసురుతూ మాస్‌ వార్నింగ్‌ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌ చర్చ జరుగుతోంది.

ఏరు దాటక ముందు మల్లన్న..

దాటాక బోడి మలన్న

సార్వత్రిక ఎన్నికల వరకు బీజేపీతో అంటకాగిన జిల్లా టీడీపీ నేతలు అధికారం దక్కాక వీరిని పూచిక పుల్లల్లా తీసే పారేశారు. బీజేపీ భాగస్వామ్యం వల్లేనే అధికారంలోకి వచ్చామనే కృతజ్ఞత కూడా ఆ పార్టీ నేతలు చూపించడం లేదంటూ పాలన ప్రారంభమైన నాటి నుంచి వీరి మధ్య అగాధం నానాటికి పెరుగుతోంది. జిల్లాలో అనాదిగా బీజేపీలో కొనసాగుతున్న కొందరు సీనియర్‌ నేతలకు సైతం జిల్లాలో పనులు జరగని పరిస్థితిని టీడీపీ ప్రజాప్రతినిధులు కల్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా అధికారులు ఉచిత సలహాలు ఇచ్చి పంపిస్తున్నారు. జిల్లాలో మంత్రులు చెప్పిందే చట్టాలుగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు ప్రతి పనికి టీడీపీ నేతల ద్వారా చెప్పించుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు కార్యాలయం తొలగింపుతో వారు తమలో ఉన్న ఆవేశాన్ని బహిరంగంగా ప్రదర్శించడమే కాకుండా టీడీపీతో బస్తీమే సవాల్‌ అంటూ తొడగొట్టడం సంచలనంగా మారింది.

అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న బీజేపీ నాయకులు

ప్రశాంతినగర్‌ వద్ద మైపాడు రోడ్డు పక్కన నిర్మిస్తున్న బీజేపీ కార్యాలయం

బీజేపీ, టీడీపీ నేతల

మధ్య మరింత దూరం

భాగస్వామ్య పార్టీని

అణగదొక్కుతున్న మంత్రి నారాయణ

మూడు దశాబ్దాలుగా ఉన్న బీజేపీ నగర కార్యాలయం తొలగింపు

ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామంటూ పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

తాత్కాలికంగా కంటైనర్‌తో ఆఫీసు తెరిస్తే.. రాత్రికి రాత్రే ఎత్తేసిన వైనం

మంత్రికి తమ పవర్‌

చూపిస్తామంటున్న కమలనాథులు

నెల్లూరు నగరంలోని మైపాడురోడ్డులో ప్రశాంతినగర్‌ ప్రాంతంలో రోడ్డు పక్కనే 30 ఏళ్లకు పైగా బీజేపీ కార్యాలయం ఉంది. అయితే ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా కార్పొరేషన్‌ అధికారులు మంత్రి నారాయణ ఆదేశాలతో ఆ పార్టీ కార్యాలయాన్ని తొలగించారు. అయితే అధికారంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ కార్యాలయాన్ని తొలగించడాన్ని ఆ పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. మంత్రి నారాయణకు తెలియకుండానే కార్పొరేషన్‌ అధికారులు తొలగిస్తారా? అంటూ ఆ పార్టీ నేతలు సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి భగ్గుమన్నారు. అయినప్పటికీ రాజకీయ వైరం పెంచుకోకూడదనే భావనతో తమ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని బీజేపీ శ్రేణులు నగర పాలక సంస్థ కమిషనర్‌ నందన్‌ను కోరగా అందుకు ఆయన సమ్మతించారు. అయితే రోజులు గడుస్తున్నా.. మంత్రి నారాయణ ఆదేశాలు లేకపోవడంతో ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో బీజేపీ నేతల కార్యాలయాన్ని తొలగించిన ప్రదేశంలోనే తాత్కాలికంగా కంటైనర్‌ను కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని కూడా తొలగించాలని పక్కనే ఉన్న ఖాళీ స్థల యజమాని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో మంత్రి ఆదేశాలతో కమిషనర్‌ ఓ రోజు అర్ధరాత్రి సమయంలో తన సిబ్బందితో పాటు పోలీస్‌ బందోబస్తుతో వచ్చి క్రేన్‌ సహాయంతో బీజేపీ కార్యాలయంగా ఏర్పాటు చేసిన కంటైనర్‌ను సైతం తొలగించారు. ఈ పరిణామంతో బీజేపీ శ్రేణులు రగిలిపోతున్నారు. నగరంలో రోడ్డు ఆక్రమణలు అనేకం ఉంటే వాటన్నింటిని తొలగించకుండా తమ పార్టీ కార్యాలయాన్ని తొలగించడం ఏమిటని కార్పొరేషన్‌ అధికారులపై మండి పడ్డారు. దీనికి కారణం మంత్రి నారాయణ అంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో దాదాపు రెండు నెలలకు పైగా పార్టీ కార్యాలయ విషయంలో బీజేపీ వర్సెస్‌ టీడీపీల మధ్య అంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయన్న ఆరోపణలు నగర ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement