ప్రభుత్వ భూముల్లో అక్రమార్కుల పాగా | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల్లో అక్రమార్కుల పాగా

May 14 2026 1:07 AM | Updated on May 14 2026 1:07 AM

ఉదయగిరి: ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్రమార్కులు వాలిపోతున్నారు. దర్జాగా ఆక్రమించి చదువును చేసి సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఆ తర్వాత నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్‌లైన్‌ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇలా రూ.కోట్ల విలువ చేసే భూములను కాజేస్తున్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. తాజాగా కలిగిరి మండలం గుడ్లదొనలో రూ.కోటికి పైగా విలువ చేసే ప్రభుత్వ భూముల్లో జాయింట్‌కలెక్టర్‌ ఆదేశాలతో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం తొలగించి ఆక్రమార్కులు సాగుకు ఉపక్రమించారు. అయినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కలిగిరి మండలం గుడ్లదొనలో సర్వే నంబర్లు 103–2లో 5.19 ఎకరాలు, 103–4లో 2.05 ఎకరాలు, 104–2లో 1.70 ఎకరాలు రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. ఈ భూమిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి అధికారుల సహకారంతో రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేయించుకుని దర్జాగా సాగు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పక్క భూములకు చెందిన ఓ రైతు అధికారులు, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆక్రమణదారులను తొలగించడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లోని అక్రమార్కుల పేర్లను తొలగించి ప్రభుత్వ భూమిగా నమోదు చేయాలని 2022 డిసెంబరు 30న తహసీల్దార్‌కు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రెవెన్యూ అధికారులు కలెక్టరు ఉత్తర్వులను అమలు చేయకుండా చెత్తబట్టలో పడేశారు. దీంతో ఆక్రమణదారులు దర్జాగా భూములను సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. తాజాగా గతంలో భూములపై పోరాడిన రైతు మళ్లీ కలెక్టర్‌ ఉత్తర్వులు అమలు కాని విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న ఆక్రమణదారుల పేర్లను తొలగించి ప్రభుత్వ భూమిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని గత నెలలో కలిగిరి తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు గత నెల 25వ తేదీన సదరు భూముల్లో ప్రభుత్వ భూములుగా సూచించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఫ్లెక్సీలు తొలగించి సాగుకు సమాయత్తం

ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి ఆక్రమణదారులు మళ్లీ సాగుకు సమాయత్తమవుతున్నారు. భూమిని ట్రాక్టర్లతో దున్ని సాగుకు సిద్ధం చేశారు. అయినా రెవెన్యూ అధికారులు మౌనంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా జాయింట్‌ కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేసినా ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అధికారులు మౌనవ్రతం పాటించడం వెనుక ఉన్న లోగుట్టు వారికే ఎరుక. ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో సైతం ఇంతవరకు ఆక్రమణదారుల పేర్లను తొలగించలేదు. స్వయంగా జేసీ ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడం విశేషం.ఈ ఉదంతం క్షేత్రస్థాయిలోని రెవెన్యూ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మరి కలెక్టర్‌, జేసీలు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి.

ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ (ఫైల్‌)

సాగుకు దుక్కి చేసిన ప్రభుత్వ భూమి

రూ.కోటికిపైగా విలువైన

భూముల ఆక్రమణ

నకిలీ పత్రాలతో ఆన్‌లైన్‌లో

పేర్లు నమోదు

2022లో పేర్లు తొలగించాలని

కలెక్టర్‌ ఉత్తర్వులు

బుట్టదాఖలు చేసిన అధికారులు

గత నెలలో మరోసారి జేసీ ఆదేశాలు

అయినా ఫ్లెక్సీలు మాత్రమే

ఏర్పాటు చేసిన వైనం

వాటిని తొలగించి సాగుకు

సిద్ధమైన ఆక్రమణదారులు

Advertisement
 
Advertisement
Advertisement