మర్యాదపూర్వకంగా.. | - | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వకంగా..

May 14 2026 1:07 AM | Updated on May 14 2026 1:07 AM

తాడేపల్లిలోని నివాసంలో బుధవారం మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి

మలిదేవికి సాగునీరు విడుదల

కొడవలూరు: కనిగిరి రిజర్వాయర్‌ నుంచి మలిదేవి కాలువకు సాగునీరు విడుదల చేశారు. ఈ కాలువ కింద కోవూరు, నార్తురాజుపాళెం, రామన్నపాళెం, మానేగుంటపాడు, ఆలూరుపాడు, మోడేగుంటలో 9,200 ఎకరాల ఆయకట్టు ఉంది. నార్లు పోసుకునేందుకు అదను దాటిపోతున్నా కాలువకు సాగునీరు విడుదల చేయలేదు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘మలిదేవి ఏం పాపం చేసింది?’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమవడంతో ఇరిగేషన్‌ అధికారులు స్పందించారు. మంగళవారం సాయంత్రం సాగునీటిని విడుదల చేశారు. కాలువ చివరి ఆయకట్టుకు బుధవారం నాటికి సాగునీరు చేరాయి.

కే జీబీవీ విద్యార్థినులకు అభినందన

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సమగ్రశిక్ష కార్యాలయంలో బుధవారం అభినందించారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు నూరు శాతం ఫలితాలు సాధించిన కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ విద్యార్థినులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

వెబ్‌సైట్‌లో

సీనియార్టీ జాబితా

నెల్లూరు (టౌన్‌): ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లోని పాఠశాలల్లో పనిచేస్తున్న మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఫైనల్‌ సీనియార్టీ జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఆర్‌ బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http:// deonellore.50webs.com వెబ్‌సైట్‌లోని సీనియార్టీ జాబితాను సరిచూసుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలను ఈ నెల 19వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

కిలో పొగాకు

గరిష్ట ధర రూ.250

మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 లభించింది. వేలానికి 255 బేళ్లు రాగా, 179 బేళ్లను విక్రయించారు. మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.200, సగటున రూ.227.13 ధర పలికిందని వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. వేలంలో ఏడు కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement